పుట:కాశీమజిలీకథలు -09.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ప్రాయముగా నెంచి సంచరించు నా పుణ్యపురుషుని వస్తుప్రదానంబున సంతసపఱుపఁ జాలను అతం డింత దనుక నవివాహితుండై యున్నట్టు విన్నదాన నప్రతిమానసౌందర్యప్రతిభాసమానుండగు నాదివ్యమంగళ విగ్రహునకు సరిపడిన పొన్నికొమ్మ యెందున్నదో? మూడులోకంబుల సరసి యాసరసునకుఁ బెండ్లిచేసి కృతకృత్యురాల నగుదును. నిందులకు నా కనుజ్ఞ యిండని కుబేరుని తమ్ముఁడు మాణిభద్రునిభార్య మదనమంజరి యను యక్షకాంత యొకనాఁడు భర్తం బ్రార్ధించినది.

అతండు సంతసించుచుఁ బ్రేయసీ! అట్టి చేడియకై మూఁడులోకములు దిరుగనేల? నీయక్క కూఁతురు త్రిపురసుందరి చక్కనిది కాదా? దానిం బెండ్లిఁ జేయరాదా ? అతండు మనుష్యుండని యమ్ముదిత నిరసించునేమో యనియా నీ సందియ మనుటయు నా మదనమంజరి యిట్లనియె.

ప్రాణేశ్వరా! మనుష్యలలోనే కాక సురగరుడోరగసిద్ధవిద్యాధరయక్షకిన్నరకింపురుషాదులలో స్వర్గమర్త్యపాతాళములలో భూతాభవిష్యద్వర్తమానకాలములయందు నమ్మహామహుం బోలిన సాహసుఁడు పరాక్రమశాలి వదాన్యుఁడు విద్వాంసుఁడు సౌందర్యవంతుఁడు తేజోమూర్తి లేఁడు కలుగఁడు. అని శపథముజేసి చెప్పఁగలను. అబ్బా! అమ్మహాత్ముని సుగుణంబులం దలంచికొనిన మేను ఝల్లుమను చున్నది. త్రిపురసుందరి యంగీకరింపదని కాదు. ఆ సుభగునకుఁ దగదని యాలోచింపుచుంటి ననుటయు మాణిభద్రుం డిట్లనియె.

త్రిపురసుందరి త్రిలోసుందరి యని వాడుకఁ బడసియున్నది కదా? వేల్పులుగూడ దానిం బరిగ్రహింపఁ బ్రయత్నించుచున్నారే. ఆఱేని కది యేమిటికి జోడుకాదు? అని యడుగుటయు నక్కలకంఠి జోడగుం గాక యమ్మహారాజు తొలుత స్వజాతి యువతిం బెండ్లియాడి కాని యితరులఁ బరిగ్రహింపఁడని వింటిని. ఈ వాల్గంటి నతనికి రెండవభార్యగాఁ జేయఁదలంచుకొంటి. కావున నిప్పుడు పుడమిఁగల దేశములఁ దిరిగి సుందరీలలామం బరిశీలించెదంగాక యని పలుకుచు నయ్యక్షకాంత యక్షీణజవంబున భూలోకంబునకుఁ బోయినది.

సీ. అంగదేశాధీశు నవరోధనము జూచి
             కుంతలేశ్వరు శుద్ధాంత మరసి
    సౌరాష్ట్రనాథు ప్రాసాదము ల్పరికించి
            కాశ్మీరవరువధూగణము గాంచి
    చోళ కాంభోజ నేపాళ భూపాలుర
           యంతఃపురస్థకన్యకల నెరిఁగి
    కరరవంగాంధ్రదేశ ప్రభూత్తంసుల
           రాణివాసముల దర్శనముఁ జేసి