పుట:కాశీమజిలీకథలు -09.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మని యడుగుటయు నతండు శాపంబునకు వెఱచి యుత్తర మిచ్చెను. మౌనభంగంబునం జేసి యతం డదృశ్యుండై శింశుపాతరువు జేరెను.

ఈరీతి నిరువదినాలుగుసారులు కట్టి తీసికొనివచ్చి భేతాళుఁడు చెప్పినకథకు బ్రత్యుత్తర మిచ్చుచు నతనిం గోలుపోవుచుండెను. బేతాళుండు చివరఁజెప్పిన కథకు విక్రమార్కునకుఁ బ్రత్యుత్తరము దోచినది కాదు. మౌనముద్ర వహించి తీసికొని పోవుచుండ నా భూతరాజు మహారాజా! నీ సాహసమునకుఁ జాల సంతసము గలిగినది. నీకు మేలుజేయు తలంపుతోనే యిట్టికథఁ జెప్పితిని. నీవంటి పరోపకారపారీణునిఁ జిక్కులం బెట్టఁగూడదు. నిన్ను నీయాతా యాతా యాతనలం బెట్టినందులకు క్షమింపుము. ఆక్షపణకుఁడు నిన్ను నాకు బలి యిచ్చు తలంపుతో నీహోమము గావింపుచుండెను. వానినే నీవు నాకు బలినిమ్ము . నీకు వశుండనై యుండెదనని చేయఁదగిన కృత్యముల బోధించెను.

విక్రమార్కుం డామాటల కంగీకరించి యయ్యర్థరాత్రంబున నా శవమును మోసికొనిపోయి యాక్షపణకుని ముంగల నిలువంబడియెను.

కృష్ణపక్ష క్షపారౌద్రమగు నా రుద్రభూమియందు విశాలశాఖాచ్చాదిత గగనభాగమగు వటవృక్షము క్రిందఁ గుణపరక్తంబున నలికి గౌరవర్ణమగు నస్తిచూర్ణంబున మ్రుగ్గుపెట్టి మండలము గల్పించి యందు నాలుగుదెసల నసృక్పూరితములగు పూర్ణకలశముల నిడి తైలదీపములు వెలిగించి, యమ్మండలమధ్యంబున నగ్ని ప్రజ్వరిల్లంజేసి తగిన సంభారములు జేర్చి యం దభీష్టదేవత నెన్నుచు హోమము జేయుచున్న యాభిక్షకుఁ డట్లు వచ్చిన విక్రమార్కునం జూచి యట్టెలేచి యత్యంతసంతోషముతో మహారాజా! నీ యనుగ్రహంబున దుష్కరంబగు మద్వ్రతసిద్ధి పూర్ణము కాఁగలదు. ఓహో? విచారింప మీవంటివారెక్కడ! హేయంబగు నీకార్యం బెక్కడ? నిజము చెప్పుచున్నాను. మీ క్షత్రియకులంబున నిట్టిధైర్యశాలి నెందును జూచి యెఱుంగను.

ఆత్మీయలాభంబించుకయు నపేక్షింపక పదార్థము నతిక్లేశముతో నిట్లు సాధించుట నీకే చెల్లును. మహాత్ముల కిదియె సహజగుణంబని విద్వాంసులు చెప్పుదురు. ప్రాణములు పోయినను ప్రతిజ్ఞను పాలింతురు అని స్తుతిఁ జేయుచు నా భిక్షకుడు భేతాళాధిష్టిత మగు శవము నతని భుజమునుండి దింపి స్నానము జేయించి పుష్పమాలికలచే నలంకరించి యాశవము నామండలమధ్యంబున నునిచెను. పిమ్మట నా క్షపణకుండు చింతాభస్మోద్ధూళితగాత్రుఁడై శవకేశముల యజ్ఞోపవీతముగా జేసికొని ప్రేతవససంబు ధరించి యామండపంబున నిలువంబడి క్షణకాలము ధ్యానించి మంత్రబలంబున నాహూతుంజేసి భేతాళు నాశవంబునఁ బ్రవేశపెట్టి యథావిధి నర్చించెను. అర్గకపాలంబున నిడిన నరకళేబరరక్తంబున నర్ఘ్యం బిచ్చి పుష్పగంధానులేపనము లర్పించి మనుష్యనేత్రంబుల ధూపం బిడి నరమాంసమున బలులు దీర్చి పూజావ