పుట:కాశీమజిలీకథలు -09.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

హింసించుచున్నది. కాఁబోలు దీని నిగ్రహించుట యెట్లో యని యాలోచించుచునప్పుడే యా శ్మశాన భూమికిం బోయి మంత్రిపుత్రుం గాంచి నమస్కరింపుచు మహాత్మా! మీ ప్రభావ మగమ్యము. మీయునికిఁ దెలిసినచో మొన్న నా పుత్రుండు చావకపోవుంగదా? ఢాకినీదేవతలు బాలఘాతుకలని విని యుంటిమి. పద్మావతి ఢాకినియే కాఁబోలు. మా యూరిలోనుండి నా పుత్రుం బరిమార్చినది. గతమునకు వగచినఁ బ్రయోజనము లేదు. ఇటు పైన దీని నెట్లు నిగ్రహింపవలయునో మీరే సెలవీయవలయును. లేనిచో నున్నవారిఁగూడఁ జంపఁగలదని ప్రార్థించిన విని నవ్వుచు నా కపటవ్రాజకుఁడు రాజా! ఆ చిన్నది ఢాకినియే కావచ్చును. నా మహిమ యెఱుంగక నాపైకిఁ గూడ నురకవచ్చినది. ఇది యన నెంత భూతభేతాళములే నా చెంతకు రా వెఱచుచుండును. కానిండు మీకు మంత్రభస్మ మిచ్చెదను. ఆ మచ్చెకంటి నీ యూరునుండి లేవఁగొట్టుటయే శ్రేయస్కరము. అది యిందుండిన మున్ముందు చాల ప్రమాదములు రాఁగలవు. మహారణ్యములో విడిచి గ్రామము చుట్టు నీభస్మము జల్లుడు. ఇఁక నెప్పుడు నీ పట్టణము జేరలేదని సంచిలో నుండి విభూతి దీసి మంత్రించి యిచ్చెను.

రాజు దానిం దీసికొనిపోయి రక్షకపురుషులఁ గొందఱఁ బల్లకితో నాఁటి యర్థరాత్రమున దంతఘాతకునింటి కనిపి తల్లిదండ్రులు మొఱ వెట్టుచుండఁ బద్మావతిని బలవంతమున పల్లకీలోఁ గూర్చుండ బెట్టి మహారణ్యమధ్యంబున విడిచిరమ్మని నియోగించుటయు వా రట్లు కావించిరి.

పద్మావతి మహారణ్యమధ్యంబున విడువఁబడి యోహా! ఈ కపట మంతయు బుద్ధిమంతుఁడగు మంత్రిపుత్రునిచేఁ గల్పింపబడినది. నే నిప్పు డేమి చేయుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? నా చేసిన కృత్రిమము నన్నే కొట్టినదని దుఃఖింపుచుండ నింతలోఁ దెల్ల వారినది. తాపసవేషములు దీసి పారవైచి వారిరువురు వారువము లెక్కి యక్కలికి యున్న యడవికిం జని వెదకికొనుచు నొకచెట్టుక్రింద జింతించుచున్న యా కాంతారత్నమును జూచి కపటవిస్మయ మభినయించుచు బాలా? నీ వెవ్వని కూఁతురవు? ఇవ్విపినంబున నొంటిగా నుంటివేల? నీ వృతాంత మెఱింగింపు మని యడిగిన నప్పడఁతి వారికి నమస్కరింపుచు మంత్రిపుత్రు నుద్దేశించి యిట్లనియె.

మహామతీ? భూమండలమున నిన్నుబోలు బుద్ధిమంతులు లేరు. బుద్ధిలేక నిన్నవమానపఱచిన నా తప్పు మన్నింపుము నాకుఁ దగిన ప్రాయశ్చిత్తము గావించితివి. ఇంతటితో విడిచి నన్ను స్వీకరింపుఁడు. బుద్ధి వచ్చినది. తప్పుపను లెన్నడును జేయను. దైవముతోడిన ప్రమాణికము జేయుటయు మంత్రిపుత్రుఁడు రమణీ! మా రాజపుత్రుండు నీ సౌందర్యచాతుర్యాదివిశేషంబుల కానందించి నిన్ను వలచుటచే దేశములు దిరిగి తిరిగి నీనికటమున కరుదెంచితిమి. దైవానుకూలంబున మీ యిరువురుం గలసికొని యానందించితిరి. స్త్రీచాపల్యంబునం జేసి నీవు గావించిన ద్రోహమునకు ఫలము జూపితిమి. ఇఁక వెఱవకుము. మారాజపుత్రుఁడు నిన్ను ధర్మపత్నిగాఁ