పుట:కాశీమజిలీకథలు -09.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

పుత్రుఁడు చాలు చాలు. ఇఁక నేను దానియొద్దకుఁ బోఁజాల నది యెంతపనియైనం జేయగలదు. మన మింటికి బోవుద మనుటయు మంత్రిపుత్రుఁ డిట్లనియె.

వయస్యా! అట్లనరాదు. దానికి నీయందుఁ బ్రీతి గలిగియున్నది. తగిన ప్రతిక్రియఁజేసి పిమ్మటఁ బోవుదము గాక. అని వారు మాటాడుకొనుచుండఁగ వీథిలో శోకాకులమగు జనకలకలధ్వని యొండు వినంబడినది. అయ్యో? అయ్యో? రాజకుమారుండు బాలుఁడు విపన్నుఁడయ్యె నక్కటా? ఒక్కఁడే కొడుకు. రాజున కెట్టి యాపద వచ్చినది? అని ప్రజలు గుంపులుగాఁగూడి చెప్పుకొనుచుండిరి.

ఆ వార్తవిని మంత్రిపుత్రుఁడు రాజపుత్రునితో నీకొక యుపాయము జెప్పెద నట్లు కావింపుము. ఈ రాత్రి శూలము ప్రచ్ఛన్నముగాఁ దీసికొని పొమ్ము. వెనుకటిదారినే దానియింటికిం బోయి రాత్రి మత్తుపదార్థములు దానికి మస్తుగా ద్రావించి క్రీడాంతరమున నది యొడలు తెలియకుండఁ బడియున్న సమయంబున నా త్రిశూలము నిప్పులోఁ గాల్చి దాని పిఱ్ఱమీఁద నంటించుము. అప్పుడును నది లేవదు. తరువాత దాని మేనియాభరణము లన్నియు మూటగట్టుకొని ప్రచ్ఛన్న మార్గమున నిందురముశి. తరువాత జేయదగిన యుపాయ మెఱింగింతునని చెప్పుటయు రాజపుత్రుండు సమ్మతింపుచు నతం డిచ్చిన త్రిశూము దీసికొని చీఁకటిలోఁ బ్రహరి దాటి త్రాళ్ళమూలమున దాని యంతఃపురమున కరిగి కొంతసే పనంగక్రీడారంగమున నంత్యముగావించి యతం డాలలన యలసియున్న సమయంబునఁ దాఁదెచ్చిన మత్తుపదార్థ మానాతి తినుచుండెడి వంటకములోఁ గలిపి మత్తుగలుగ జేసెను. అప్పడతి యొడ లెఱుంగక గాఢముగా నిద్రఁబోయినది. త్రిశూలముం గాల్చి పిరుదుపై నంటించి చిహ్నము గలుగఁ జేసి దాని మేని యాభరణములన్నియు దీసి మూటఁ గట్టుకొని రివ్వున గోడదుమికి ప్రహరి యెక్కి యిక్కకుం జని మంత్రిపుత్రున కా నగ లన్నియుం జూపెను.

మంత్రిపుత్రుఁడు మిత్రుని మెచ్చుకొనుచు మఱి నాలుగుదినములు గడిపి కాషాయాంబరములు ధరించి తానొక యవధూతవేషము వైచికొని రాజపుత్రుని శిష్యునిగా నిరూపించి శ్మశానవాటికలో గూర్చుండి పద్మావతి యాభరణములలో ముత్యాల హార మొకటి రాజపుత్రుని కిచ్చి యిది యంగడికిఁ దీసికొని పోయి యమ్మకము జూపుము. రాజభటులు వచ్చి నిన్ను బట్టుకొనిన నిట్లు చెప్పుము. అని యేమేమో బోధించి యంపెను. అతం డాముక్తాహారం బంగడికిఁ దీసికొని యమ్మఁజూపుచుండెను. ఏ వెలకు నియ్యక యటు నిటు తిరుగుచుండెను. దంతఘాటకుఁడు మిక్కిలి భాగ్యవంతుఁడు. ప్రాణము లన్నియుఁ బుత్రికపై బెట్టుకొని యున్నవాఁడు. పుత్రిక వస్తువులన్నియు దొంగలెత్తుకొని పోయిరని దాదులవలన విని యా వార్త గ్రామాధికారికిఁ దెలియఁ జేసియున్నవాఁడు. అయ్యధికారి రక్షకభటులతోఁ జెప్పియున్న కతంబునఁ బద్మావతి విలాసచిహ్నితమగు ముక్తాదామంబు రాజపుత్రుని చేతంజూచి రాజభటు లతనిం బట్టుకొని యిది నీకెక్కడిది? నీవు సన్యాసివయ్యు భూషణముల నెట్లు సంపా