పుట:కాశీమజిలీకథలు -09.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

జేరంబోవునంతలో నత్తలోదరి యదిరిపడి యట్టెలేచి యెదుర నభినవమన్మధుండువోలె నొప్పుచున్న యా రాజకుమారుం గాంచి హర్షపులకితగాత్రయై కంఠాశ్లేషంబు గావింపుచుఁ గపోలముల ముద్దువెట్టుకొనుచుఁ దల్పంబునం గూర్చుండిఁబెట్టి పూసురటి వీచుచు -

క. మముఁ గడుశ్రమపెట్టితి నను
   క్షమియింపుఁడు మీదు బుద్దికౌశలమునకుం
   బ్రమదంబుగలిగె మన్మతి
   సమయంబు గ్రహించితిరి విశాలమనీషన్.

అని పొగడుచు శృంగారలీలాతరంగితాంతరంగియై తనకుగల యనంగశాస్త్రపాండిత్యము తేటపడ ననేక రతివిశేషంబుల నా రాజకుమారు నపారసంతోషపారావారతరంగముల నోలలాడించినది. అట్లా రాజపుత్రుండు గుప్తముగా నా వాల్గంటి యింటనుండి తుంటవిల్కాని వేడుకలతోఁ బది యహోరాత్రము లొకగడియ వలె వెళ్ళించి యొకనాఁ డాచేడియతోఁ నిట్లనియె.

మానవతీ! నీ వలపు తీపులకుం జిక్కి నీప్రక్కవిడువక పెక్కుదినములు గడిపితిని. నా ప్రాణమిత్రుఁ డొక్క డీయూర నా వృద్ధయింట నున్నాఁడు. వాని నొక్కసారి చూచివచ్చెద ననుజ్ఞయిమ్మని పలికిన నక్కలికి యులికిపడి యేమి? నీ కొక మిత్రుఁ డున్నాడా? నా సంజ్ఞలన్నియు గ్రహించినవాఁ డాతడా నీవా? అని యడిగిన నతఁ డిట్లనియె.

అతివా! అతండు చాల బుద్ధిమంతుఁడు. నీవు గావించిన చర్య యొక్కటియు నా కూహకు రాలేదు. అన్నియు నతండే గ్రహించి నన్నిందుఁ దీసికొని వచ్చెనని యా వృత్తాంత మంతయుం జెప్పెను. ఆ మాట విని యా ధూర్త అయ్యో? నీ మిత్రునిమాట యెప్పుడుం జెప్పితిరి కారేమి? ఇన్నినాళ్ళు బూజింపక యపరాధి నైతి. మీకు మిత్రుడు. నాకుఁ బూజ్యుఁడు. తాంబూలాదివస్త్రప్రదానంబున నతనిని ముందుగనే సంతసపరవలసినది. చెప్పనితప్పు మీయందే యున్నది అని పలుకుచు నా రాజపుత్రుని వెనుక వచ్చినదారినే గోడదాటించి యతని నివాసమున కనిపినది. రాజపుత్రుండు వృద్ధయింటికింబోయి. తన రాక కెదురుచూచుచున్న మంత్రిపుత్రుం గౌఁగలించుకొని వయస్యా! నీ బుద్ధిబలమువలన నాకననుభూతపూర్వమగు సంతోషము గలుగఁజేసితివి. పద్మావతి మిక్కిలి రూపవతి. తేజోవతి. అట్టిజాన నెందును జూచి యెఱుంగ నాహా! తత్క్రీడాసల్లాపవినోదంబు లేమని చెప్పుదును? అని పొగడుచుఁ దాని నాయింటిలోఁ బ్రవేశించినది మొదలు నా క్షణమువఱకు జరిగిన రహస్యచర్యలన్నియుఁ బూసగ్రుచ్చినట్లు తెలియపరచెను.

అప్పుడు మంత్రిపుత్రుఁడు అయ్యో అన్నియుం జక్కగాఁ జేసితివికాని యా సంజ్ఞలన్నియు నా మిత్రుఁ డెఱింగి చెప్పెనని చెప్పుట పొరపాటు. దానివలన