పుట:కాశీమజిలీకథలు -09.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి కథ

199

వృద్ధ ప్రహరి దిగి యింటికివచ్చి జరిగినచర్య యంతయుం జెప్పినది. రాజపుత్రున కేమియుఁ దెలిసినదికాదు. మంత్రిపుత్రుఁడు రాజపుత్రుని భుజముపైఁ గొట్టుచు వయస్యా! నీ యభీప్సితము ఫలించినది. నిన్నంటియున్న తుంటవిల్కానిఁ గృతార్థుం గావింపుమని పలికిన నతండు వయస్యా! ఎట్లు గ్రహించితివి? అది వృద్ధతో నేకాంతముగా నేమాటయైనం చెప్పినదాయేమి? చెప్పుము, చెప్పుమని యడిగిన నవ్వుచు మంత్రిపుత్రుఁడు మిత్రమా! నీ కింకనుఁ దెలియలేదు. అది చేయించినచర్య యంతయు వృద్ధయందుఁగల ప్రేమచేతఁగాదు. నిన్నట్లు రమ్మని మార్గము దెలిపినది. నీవీరాత్రి యందుఁ బోవచ్చును. కార్యసిద్ధి యగునని చెప్పి వాని సంతోషపారావారవీచికలలో ముంచివైచెను.

పెందలకడ భోజనముచేసి రాజపుత్రుండు చక్కఁగా నలంకరించుకొని యుండ వృద్ధచెప్పిన మార్గంబున మంత్రిపుత్రుఁ డతని నా యింటిప్రహరియొద్దకుఁ దీసికొనిపోయి దాపుననున్న వృక్షశాఖామూలకముగా నతని బ్రహరి యెక్కించెను. తరువాత నతండు లోపలనున్న చెట్టుకొమ్మమీఁదుగా నుద్యానవనములోనికిఁ దిగి యందొక గోడప్రక్కను వ్రేలాడుచున్న పీఁటపైఁ గూర్చుండి త్రాళ్ళు కదిపెను. లోపల నొక చిన్న గంట మ్రోగినది. ఆ వెంటనే త్రాళ్ళు పైకిలాగఁబడినవి. గవాక్షవివరమునుండి యా రాజపుత్రుఁడు పద్మావతి యున్న మేడమీదికిఁ బోయెను.

అది యంతయుం జూచుచు మంత్రిపుత్రుఁడు తిన్నఁగా నింటికిం బోయెను.

రాజపుత్రుఁ డా యింటిలోఁ బ్రవేశించి యందు -

సీ. తతహంసతూలికా తల్పంబునను దల
              గడ నోరఁగా జేరబఁడి యొయూర
    మమర సన్నని వలిపెము జరీమెఱుఁగు చె
             రఁగుపైటలోని తోరంపుగబ్బి
    గుబ్బలుబ్బగమై గగుర్పొడువంగఁదా
             వ్రాసిన రాజపుత్రకుని చిత్ర
    ఫలకమీక్షింపుచు లలితాంగరుచు లలం
             కారదీప్తులఁ దిరస్కారపరుపఁ
గీ. బూర్ణచంద్రాననంబు ప్రఫుల్లపద్మ
   పత్రసమనేత్రములు మృదుపదయుగంబుఁ
   గలిగి త్రిభువననుతరూపకలితయగుచు
   కాంతి నొప్పారు పద్మావతీవధూటి.

కనుంగొని యారాజనందనుం డందెవ్వరులేమికి మిగుల సంతసించుచుఁ