పుట:కాశీమజిలీకథలు -09.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఆ చిన్నది సక్తయే యైనచో మనవార్తవిని యీమె నిట్లేలఁ గొట్టును. ఇఁక నిరాశఁ జేసికొని మనము పోవచ్చునా? అని యడిగిన మంత్రి పుత్రుం డిట్లనియె.

మిత్రమా! ఇంతమాత్రమునకే కార్య నైరాశ్యముఁ బొందెదవేల? ఆ చిన్నది కడుజాణ. అదియు భావసూచకమే? వినుము ఇవి వెన్నెలరాత్రులు పది మిగిలియున్నవి. అది దాటినఁగాని సంగమావకాశము గలఁగదని తెలియజేయుచుఁ గర్పూరములోఁ బదివ్రేళ్ళంటించినది. తొందరపడకుమని బోధించెను.

వెన్నెలరాత్రులు గతించిన తరువాత మఱి రెండుమాడలా వృద్ధచేతిలోఁబెట్టి మంత్రిపుత్రుండు తల్లీ! నీవొకసారి యా నారీమణి యొద్దకుఁబోయి కూర్చుండుము. ఏమియు మాటాలాడవలదని బోధించి యంపుటయు నది వోయి వచ్చి యచ్చతురుల కిట్లనియె.

అయ్యా! మీ మాటవడుపునఁబోయి నే నేమాటయు నాడక నాకడదాపునఁ గూర్చుంటిని. ఆ పద్మావతి వెనుక నేనుజేసిన యపరాధ ముగ్గడింపుచుఁ బారాణిలో మూఁడు వ్రేళ్ళు జొనిపి నా యురంబున గొట్టినది చూడుఁడు. గురుతు లెట్లంటు కొన్నవో అని చెప్పినది.

ఆ మాట విని రాజపుత్రుఁడు మొగంబు నధైర్యము దోప వయస్యా! నన్నూరక వెఱ్ఱియాశ పెట్టుచుంటివి. మనయం దిష్టమున్న నిట్లు సందేశహరిణిం గొట్టునా? అని పలికిన విని మంత్రిపుత్రుఁడు వయస్యా! నిదానింపుము. ఇదియు నభిప్రాయసూచకమే. తాను రజస్వల యైనట్లును మూఁడు దినములు తాళుఁడని సూచించుచున్నది. అని యెఱింగించిన యతనికి సంతోషము గలుగఁజేసెను.

మూఁడు దినములు గడచినవెనుక మంత్రిపుత్రుఁడు వెండియు నా వృద్ధురాలి చేతిలో నాలుగుమాడలు పెట్టి యెట్లో కష్టపడి మఱియొకసారి యా నారీరత్నము నొద్దకుఁ బోయిరమ్ము. ఏ మాటయుఁ జెప్పవద్దని పలికి యామె నంపెను. ఆ జరఠ వెనుకటివలెనే పోయి పద్మావతిం జూచినది. ఆ చిన్నది యేమియుం మాటాడక చాల గౌరవించి వినోదములు పెక్కులు గావింపఁజేసి సాయంకాలము దనుక నందుండ నియమించినది.

ఆ వృద్ధ అమ్మా! పోయివత్తు ననుజ్ఞ యిమ్మని పలుకుచు ద్వారదేశము చేరునంత వీథిలో గోలాహలధ్వని వినంబడినది. పెద్ద యేనుఁగునకు మదముదిగినది. గొలుసు త్రెంచుకొని బారిపోవుచుఁ గనంబడిన వారినెల్లఁ గొట్టుచున్నదని జనులు నలుమూలలకుఁ బరుగిడుచున్నారు.

అప్పుడు పద్మావతి వృద్ధను నీవు రాజమార్గంబునం బోవలదు. ఈపీటకుఁ ద్రాళ్ళు కట్టెదము. దీనిపైఁ గూర్చుండుము. పెద్ద గవాక్షముదారిని దొడ్డిలోనున్న తోఁటలోనికి దింపెదము. ప్రక్కనున్న చెట్టెక్కి ప్రహరిదాటి యవ్వలికిఁ బొమ్మని యుపాయము చెప్పి యట్లు చేయించినది.