పుట:కాశీమజిలీకథలు -09.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి కథ

197

నున్నవాఁడని ప్రసిద్ధి. దంతఘాటకుఁ డతని ప్రసాదవిత్తుఁడు, సంద్రామవర్దనుఁడను నామాంతరము గల యతనికిఁ ద్రిలోకసుందరియగు పద్మావతి యను కూతురు గలదని అదివఱకే నేను వినియుంటిని. ఆ కన్యకయం దతనికి ప్రాణములకన్న నధికమగు ప్రీతిఁ గలదని చెప్పుకొందురు. ఈవృత్తాంత మింతకుమున్నె వినియున్నవాఁడఁ గావున నా సంజ్ఞలన్నియు గ్రహించితిని. అని యెఱింగించినంత నత్యంతసంతోషముతో నతనిం గౌగలించుకొని యిట్లనియె.

వయస్యా! నే నాసుందరీమణి సౌందర్యలోకాన వివశుండనై యేమియు గ్రహింపలేకపోయితిని. నీవు మిక్కిలి బుద్ధిమంతుఁడవు. ఎట్లైన నా కన్యకారత్నము స్వాధీన మగునట్లు చేయుమని ప్రార్థించెను. అప్పుడే వారిరువురు బయలుదేరి క్రమంబునఁ గళింగదేశంబున కరిగి యందుఁ గర్ణోత్పలుని నగరము ప్రవేశించి దంతఘాటకుని గృహమును వెదకికొనుచుఁ బోయి తత్ప్రాంతమందున్న యొకవృద్ధాంగన గృహంబు బ్రవేశించి అంబా! యీ యూర సంగ్రామవర్దనుండను దంతఘాటకుని నెఱుంగుదువా? అని యడిగిన నా జరఠ యిట్లనియె. అయ్యో అతని నెఱుఁగ కేమి? నే నతని కూతురు పద్మావతికి ధాత్రిని నన్నామెచెంత నుండునట్లు నియమించెను. అదియే వారియిల్లు. నాకుదగిన పుట్టంబులు గట్టలేమిం జేసి యిప్పుడామె యొద్దకుఁ బోవుట మానివేసితిని. నా కొడుకు దుర్మార్గుఁడు. నా వసనంబుల జూదమాడి యోడిపోయెనని చెప్పిన విని సంతసించుచు మంత్రిపుత్రుండు ధాత్రీ నీవు విచారింపకుము. నీకుఁ గావలసిన వస్త్రంబులు దెచ్చికొనుము, సొమ్మి చ్చెద నని రెండు మాడల చేతం బెట్టెను.

అది మిగుల సంతసించుచు మంచివస్త్రంబులు దెచ్చికొని బాబూ ? నీకు నా వలనఁ గాఁదగినపని యేదైనఁగలదేని వక్కాణింపుఁడు. కావించి కృతకృత్య నయ్యెదనని పలికిన విని మంత్రుఁడు అమ్మా! నీవు మంచిదానవు. మా రహస్య మెవ్వరికిం దెలియనీయకుము. పద్మావతి యొద్దకుఁబోయి మా మాటగా నిట్లు చెప్పుము. నీవల్ల నాఁడు తటాక ప్రాంతమునఁ జూచిన రాజకుమారుఁడు నీ నిమిత్తమై వచ్చియున్నాడు. పరిచయముచేత నే నీరహస్యము నీ కెఱింగించితినని చెప్పుము.

అని యుపదేశించి పంపుటయు నా వృద్ధ యతివేగముగాఁ పోయి మఱి రెండు గడియల కరుదెంచి కన్నుల నీరుగ్రమ్మ వారి కిట్లనియె అయ్యా! నేను రహస్యముగాఁబోయి మీ రన్నమాటలఁ బద్మావతికిం జెప్పితిని. అప్పుడు ముప్పిరి గొను కోపముతో నా యొప్పులకుప్ప దెప్పునఁ దనచేతుల కప్పురంబు నద్ది నా రెండు దవడలమీఁద జెంపకాయలు గొట్టినది. వ్రెళ్ళంటుకొని యా చిహ్నములు గనంబడుచున్నవి. చూడుడు అని దుఃఖించుచుఁ జెప్పికొన్నది. అప్పుడు రాజపుత్రుఁడు వయస్యా నీవా పూవుఁబోఁడి చేసిన చేష్టలు వేఱొకలాగున భావించి నాయందే లగ్నమైన చిత్తముతో నేమేమో సంజ్ఞలం గావించినదని జెప్పితివి. అది కాముకాశయము.