పుట:కాశీమజిలీకథలు -09.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అం దొకతీరమున సఖీపరివృతయై తీర్థంబు లాడుచున్న మించుబోఁడి యోర్తు రాజపుత్రిని హృదయ మాకర్షించినది. స్వశరీరలావణ్యప్రవాహంబున నాతటాకంబుఁ బూరించుదానివలె దృష్టిపాతంబుల నూత్నోత్పలవనం బందు సృష్టించువానివలెఁ జతేందువగు మొగంబునందుఁగల యరవిందంబుల డిందుపఱచుదానివలె నొప్పుచు దివ్యాకృతిఁగల యాకలకంఠం జూచి యత్తరుణుండు చిత్తజాయత్తచిత్తుఁడై యుత్తల మందుచుండ నయ్యిందువదనయుఁ గందర్పసుందరుండగు నారాజనందనుం గాంచి పంచశరశరవిద్ధహృదయమై సహజాలంకారంబగు లజ్జచేఁ దల వాల్చుకొని యోరచూపుల నతనిం జూచుచు నతండు సూడఁ దనదృష్టుల మరలించుకొనుచు వివిధవిలాసతరంగితాంతరంగియై యొప్పుచు నతండు సూచుచుండ సాకూతంబుగా శిఖావతంసముగా నిడిన యుత్పలముఁ దీసి కర్ణంబునం బెట్టినది. మఱియొక పద్మంబు శిరంబున నుంచినది. హృదయంబునఁ గరంబు నిలిపినది. కాని రాజపుత్రుఁ డా సంజ్ఞల నేమియు గ్రహింపలేక యూరక యున్మత్తుఁడువోలెఁ జూచుచుండెను. అంతలో నా కాంతారత్నము బరిజనులతోఁగూడ నాందోలక మెక్కి తనదేశమునకుం బోయినది.

రాజపుత్రుండును భ్రష్టవిద్యుండగు విద్యాధరు చందంబున మతిచెడి యుస్సురని నిట్టూర్పు నిగిడింపుచుండ మంత్రిపుత్రుండు వయస్యా! జలంబుల గ్రోలి యవ్వలికిఁ బోవుదము రమ్ము. అమృతోపమానంబగు తోయంబు సమీపంబుననుండ నూరక చూచుచుంటివేమి? కాసార విలసంబులా? పిపాసాలనుండ నింతసే పెట్లు తాళితివని యడిగిన రాజపుత్రుం డిట్లనియె.

మిత్రమా? నాయాత్రము నీతో నేమని వక్కాణింతును? మన మిక్కడికి రాకున్నను జక్కగా నుండెడిది. జగన్మోహనవిలాసాకారభాసుర యగునాతరుణీలలామము నా కన్నులం బడకున్నను బ్రతికిపోవుదుము, కనంబడియు నాదిసఁజూడకున్న నీపరితాపము లేకపోవుంగదా? చూచినను శృంగారలీలల నేల ప్రకటింపవలయును? ప్రకటించి కొంతసే పిందుండక మెఱుపువలె నంతలో లేచిపోవవలయునా? తదీయ కులశీలనామదేశంబు లెట్టివో తెలియవు. నా మనోవ్యథ దుర్భరముగా నున్నది. ఇట్టి బాధ నే నెప్పుడు పడి యెఱుంగ నిందుల కేదియేని ప్రతీకారము గావించి నీమిత్రు బ్రతికించు కొమ్మని పలికిన విని మంత్రిపుత్రుండు నవ్వుచు నిట్లనియె.

వయస్యా! రహస్యముగా మీచేష్టలన్నియు నేను బరీక్షించుచునే యుంటిని. నీవు విచారింపవలదు. ఆ చిన్నది సాకూతముగాఁ దనకులశీలనామంబులు దెలియఁ జేసియున్నది. నీవు గ్రహింపలేక పోయితివి. వినుము కర్ణంబున నుత్ఫలం బిడుటచే కర్ణోత్పలుఁడను రాజు రాష్ట్రంబున జన్మించిననియు దంతములు రాయుటచేఁ దంతఘాటకుని కూతుర ననియుఁ బద్మధారణంబునంజేసి పద్మావతి యను పేర గలదిగా నిరూపించినది. మఱియు హృదయంబున హస్తముండుటచే నా ప్రాణములు నీయందే యున్నవని సూచింపఁ బడుచున్నవి. మఱియు నాకర్ణోత్పలుఁడు కళింగరాష్ట్రంబున