పుట:కాశీమజిలీకథలు -09.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి కథ

195

ద్రొబ్బితిని. జీవమున్నది కాఁబోలు? సన్యాసి చెప్పినతరువిదియే యగునా? అని యాలోచించుచు నల్లన చెట్టు దిగివచ్చి పతనవ్యధ వాయ నిమురుటకై దానిమేనఁ గేలు మోపినంతఁ బ్రళయభైరవాట్టహాసముఁ గావించినది.

ఓహో! తెలిసినది. దీనికొఱకు నేను జాలినొందఁ బనిలేదు. ఇది భేతాళాధిష్ఠితమగు శవంబు. దీనిగురుతు లన్నియు నతండు చెప్పినట్లే యున్నవి. అని తలంచుచు నోభూతరాజమా? నిన్ను నే విడుచువాఁడను గాను. నన్నేల చిక్కులు బెట్టెదవు? నావెంట రమ్మని పలుకుచుండగనె నాశవం బంతర్థానము నొందినది.

అయ్యో! మరచిపోయి మాట్లాడితిని, మాట్లాడిన నది యదృశ్య మగునని సన్యాసి చెప్పియేయున్న వాఁడు. అయినఁ గానిమ్ము , అది యెక్కడికిఁ బోఁగలదు. అని నలుమూలలు పరికించుచుండ నాతరుమూలమున వెనుకటివలె వ్రేలాడుచుండెను. అన్న! ముచ్చా! నీశాంబరీడాంబికములకు నేను లొంగువాఁడను కాను నిన్నుఁ గొంపోక విడువను రమ్ము. రమ్ము. అని పలుకుచు వెనుకటివలెనే యాశవమును నేలం బడవైచి తదట్టహాసఘోషములకు జడియక యప్పీనుఁగు కాలుచేతులు గట్టి భుజముపై నెక్కించుకొని యుత్తరాభిముఖుండై యరుగుచుండెను.

అప్పు డాశవసంసిస్థితుండగు భేతాళుండు మహారాజా! ఈయర్థరాత్రంబున నీస్మశానములో నీచెట్టుచెంతకు వచ్చి నన్నుఁ బట్టుకొని నాయరపులు విని బ్రతికియున్నవాఁడవు. నీవంటి సాహసాంకుని మూఁడులోకంబులయందును జూడనేరను. మనుష్యమాత్రున కిపనిఁ జేయశక్యమా? నీదైర్యము నీసాహసము నాకు మిగులసంతోషము గలుగఁ జేసినవి. నిన్ను మెచ్చుకొంటి. వినోదముగా నీకొక కథఁ జెప్పెద నాలింపుము.

పద్మావతి కథ

ధారుణీకైలాసంబగు వారణాశీపురంబునఁ బ్రతాపమకుటుండను రాజు రాజ్యము సేయుచుండెను. అతనికి వజ్రమకుటుండను కుమారుడుఁగలఁడు. వాని సౌందర్యము త్రిభువనస్తోత్రపాత్రమై యున్నది. మహామతియను మంత్రిపుత్రుఁ డారాజపుత్రునకుఁ బ్రాణమిత్రుఁడై యనుసరించి తిరుగుచుండును.

వారిరువురు నొకనాఁడు సముచితపరివారముతోఁ గూడికొని వేటకై దూరదేశకాంతారముల కేగి యాథేటనపాటవంబులఁ బెక్కుమృగంబులఁ బరిగొని నరిజనులకు దూరమై యలసి పిపాసాలాలసులై జలాశయముండుచో టరయుచు గుఱ్ఱములెక్కి పోయిపోయి యొకచోట -

చ. పరిమళ బంధురప్రసవ పత్ర విచిత్రఫల ప్రసూన భా
    సుర వివిధద్రుమోపల విశోభిత తీరము నారసౌరభాం
    బురహ చరన్మధువ్రత మభోగవిరాన మనోజ్జ మబ్ధిభా
    స్వరము సరోవరం బొకటి ప్రాంతమునం గనిపించె వారికిన్.