పుట:కాశీమజిలీకథలు -09.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

వీనిం బట్టించి బందీగృహంబునం బెట్టించి శిక్షింపఁదలంచుకొంటి. నిందులకు మంత్రులు, సామంతులు ననుమతింపవలయునని భార్య చెప్పిన మాటలన్నియు నుగ్గడించుచు నుపన్యసించుటయు, నంతకుముందు వానియం దీసుఁ బూనియున్న సామంతులు, మంత్రులు నందుల కంగీకరించితిమని చేతులెత్తి కేకలు పెట్టిరి.

అప్పుడు రాజు వానిఁ పట్టుకొనుటకు భటుల కాజ్ఞాపించెను. వాండ్రు పెక్కండ్రు విచ్చుకత్తులతో నతనిం జుట్టుకొని పట్టుకొనఁ బోయినంత నావీరుఁడు రౌద్రావేశముతో నొక్క భటుని చేతినుండి కత్తిలాగికొని మండలాకారముగాఁ ద్రిప్పుచు నందున్న వీరభటుల నెల్లఁ బరిభవించి సభ్యులకు రాజునకుఁగూడ దమ్ముఁ జంపునేమో యని వెరపు గలుగఁజేయుచు లఘుగమనంబున నయ్యోలగము దాటి యెందేనిం బోయెను.

వానితలిదండ్రు లెవ్వరో భార్యాపుత్రు లెవ్వరో యేదేశమువాఁడో యెప్పుడును రాజు వాని నడిగియుండలేదు. అతండును జెప్పలేదు. వాఁడు లేచిపోవుట గొప్పముప్పు దాటినట్టు రాజు సంతసించుచు నప్పట్టణము ప్రాంతదేశములు వాని గుఱించి విమర్శించెను గాని వానిజాడ యేమియుం దెలిసినదికాదు.

సుమతిం బరిభవించినది మొదలు వాఁడు శత్రురాజులం గూడి యేమి యపకారము గావించునో యని నిద్రాహారములు క్షీణింప విజయపాలుండు మనసుచెడి వెఱ్ఱివాఁడుం బోలె వర్తింపుచుండెను. నిరపరాధుల దండించిన పాప మూరక పోవునా? మఱి పది దినములకే మధువర్మ మందపాలునితోఁ గూడఁ జతురంగవాహినీసమేతముగా వచ్చి పట్టణము ముట్టడించి రణభేరి గొట్టించెను.

ఆ ధ్వనితోఁగూడ నా వృత్తాంతము విని విజయపాలుం డసువులూడినట్లు బెదరుచుఁ గర్తవ్య మేమియో తెలియక కోటతలుపులు మూయింప నాజ్ఞాపించెను. కాని యంతలో శత్రుబలములు సముద్రమువలె విజృంభించి కోట ముట్టడించి తలుపులు మూయనీయక లోపలఁ బ్రవేశించి కనంబడినవారి నెల్లఁ బట్టుకొని కొట్టుచు బంధించుచు గవాటంబులఁ బగులఁ గొట్టుచు, గోడలుఁ గూలఁద్రోయుచు, మణివేదికలఁ ద్రవ్వుచు, రత్నంబుల దోచుకొనుచు, స్త్రీల జెఱఁబెట్టుచు బెక్కువిధంబుల నట్టహాసముగాఁ గోట మట్టుమాయఁ జేయుచుండిరి. కొందఱు వీరభటులు రా జెక్కడెక్కడని యుక్కుమిగిలి పైమేడ కెక్కి వెదకుచుండిరి. ఆ యలజడి యంతయుఁ దెలిసికొని విజయపాలుండు భార్యపైఁ బడి దుఃఖించుచుఁ బ్రేయసీ? మన యాయువు లిక గడియలో ముగియుచున్నవి. సుమతియే యీయాపదఁ గలుగఁజేసెను. వానిం బాటవంబునఁ బట్టుకొనవలసినది. పొరపాటు జరిగినది వా డిట్టిద్రోహుడని తెలిసికొనలేకపోయితిమి. అని వానిని నిందించుచుండ వారించుచు నామె చేతులు జోడించి యిట్లనియె. మహారాజా! నాకిఁక గడియలో మరణమగునని చిహ్నములు గనంబడుచున్నవి. ప్రాణోత్ర్కమణసమయంబునఁ దాను జేసిన పాతకముల నుగ్గడించినచో యమదండన లేదని