పుట:కాశీమజిలీకథలు -09.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయపాలుని కథ

23

శ్లో. అదా వసత్మవచనం పశ్చాజ్ఞాతాహి కుస్త్రియః
    స్త్రీవచో ప్రత్యయా హంతి విచారం మహతామపి.

ముందుగా నసత్యవాక్కులు తరువాత దుష్టస్త్రీలు జనించిరి. స్త్రీల మాటలనే నమ్ముట చేత మహాత్ములకు సైతము సత్యాసత్యవిచారము గలుగనేరదు.

సీ. భార్య చెప్పిన మాట పాటించియేకాదె
               పంపెఁ గానకు రాముఁ బంక్తిరథుఁడు
    భార్య చెప్పిన మాట పాటించియే కాదె
              దండించె సారంగధరునిఁ దండ్రి
    భార్య చెప్పిన మాట పాటించి యుత్తాన
              పాదుండు ధ్రువు పదభ్రష్టుఁజేసె
    భార్యబోధనెకాదె పరిభవించె సునందు
              వసుమిత్రుఁడను మహివల్లభుండు
గీ. ధాత్రి నెటువంటి యుత్తమోత్తములకైన
    నాలివాక్యంబు వేదవాక్యంబు సూవె
    తమరు భార్యను గావించు తప్పులన్ని
    యొరుల పైబెట్టి నిందింతు రూహలేక.

విజయపాలుండు భార్య చెప్పిన మాటలన్నియు నాకర్ణించి క్రోధాగ్నిజ్వాలలు నిట్టూర్పు గాడ్పులఁ బ్రజల్వరిల్లంజేయుచు అన్నా, సుమతి కుమతియై యెట్టి ద్రోహము చేయుట కుద్యమించెను! అగునగు! దలంచుకొననంతయు నిక్కమని తెల్ల మగుచున్నది. ఏమియు నెఱుంగనివాని కంతలో వంటకమున విషం బిడిన ట్టెట్లు తెల్లమగును? దుర్మంత్రంబునం గాక యొక్కఁడు పోయి యేదియో చెప్పినంతనే సేనల మరలించుకొనిపోవునా! అదె యంతయు నభినయమే కావచ్చును. ఇఁక వీఁడుండిన ననర్ధము కాకమానదు. అని యాలోచించి భార్య నూరడించి నాఁడు పెందలకడ సభకుఁ బోయి కూర్చుండెను.

సుమతియు వాడుకప్రకారము నియమితకాలమునకు వీరభటవేషముతో సభకుఁ బోవుచుండ దారిలో నపశకునములైనవి. దానందన యేలిక కేమి యమంగళము గలుగునోయని స్తుతిశ్లోకములం జదువుచు నోలగంబునకుం బోయి ముందు రాజునకు నమస్కారముఁ గావించెను. నమస్కార మందికొనక పెడమోము పెట్టి చూపుల నిప్పుల గ్రక్కుచు నతండు పీఠముపై గూర్చుండిన వెంటనే సభ్యులతో వినుండీ సుమతి సుమతి యని నమ్మి చిరకాలమునుండి యాశ్రయించికొనియున్నమంత్రుల బెక్కండ్ర దగ్గించి యనేకగ్రామములు గానుకలగా నొసంగి సమానప్రతిపత్తితోఁ జూచుచుండ వీఁడు శత్రుపక్షపాతియై యీ రాజ్యమునకు హానిచేయఁ దలంచుచున్న వాడు. అదియునుంగాక యతఃపురద్రోహము సేయుటకుగూడ బ్రయత్నించెను.