పుట:కాశీమజిలీకథలు -09.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దిగ్విజయము సేయుటకై దండయాత్ర కనుజ్ఞ యిమ్మని కోరుచున్నాఁడు. తదీయ సాహసవితరణాదిగుణంబుల నగ్గింపుచు భూపాలురనేకులు నాకుఁ బత్రికలు వ్రాయుచున్నారు. మనము పెద్దవార మైతిమి. వాని రాజ్యపట్టభద్రుంజేసి వారణాశీపురంబున కరుగదమని పలికిన నామెయుఁ జాల సంతోషించినది. ప్రజలావార్త విని వృద్ధరాజు నభినందింపుచు దమయుత్సాహమును వెల్లడించిరి. శత్రువులు దల్లడించిరి. మిత్రు లుప్పొంగిరి. నాస్తికులు పొరటిల్లిరి.

మహేంద్రాదిద్యుం డొకశుభముహూర్తమునఁ జతుస్సముద్రోదకములఁ దెప్పించి మహావైభవముతో విక్రమార్కునిఁ బట్టాభిషిక్తుం గావించి దీవించుచు నిట్లనియె. వత్సా! దేవతలుగూడ నీయందుఁ బ్రీతులై యున్నారని వినుచున్నారము. దేవరక్షితుండవగు నీకేకొఱంతయు నుండదు. కాని నీయందుఁగల ప్రేముడి నన్నిట్లు వాచాలునిఁ జేయుచున్నది వినుము. లక్ష్మీమదము, నూత్నయౌవనగర్వము, అమానుషశక్తి, ప్రతిభ, ప్రభుత్వాతిశయము ఇవి యొక్కటియే సర్వానర్థములకు మూలమైనవి. అన్నియుఁ గలసినఁ జెప్పవలసినది లేదు. రాజ్యమదావిష్టులగు రాజులు కన్నులు మూసికొని పోయి తమ్ము దా మెఱుంగక పూజ్యులఁ బూజింపక గురువుల మన్నింపక మిత్రుల నాదరింపక చూచుటయే మహోపకారము, పలుకుటయే సామ్రాజ్యార్పణముగాఁ దలంచుచు గర్వాభిభూతులై పెద్దల మాట వినక తామే సర్వజ్ఞులమని తలంచుచుందురు.

అతికుటిలకష్టచేష్టాదారుణంబగు నిట్టి రాజ్యతంత్రంబున సక్తుండవు కాక మహామోహాంధకారంబు ప్రజ్ఞాదీపంబున నణంగఁ ద్రొక్కుచు జనులచేఁ బరిహసింపఁబడకుండ సాధువులచే నిందింపఁబడక, గురువులచేఁ దిరస్కరింపఁబడక, విద్వాంసులచే శోచింపఁబడక, విటులచే నవ్వఁబడక సేవకవృకంబులచే వంచింపఁబడక స్త్రీలచే విడంబనఁజేయఁబడక లక్ష్మిమదంబున నున్మత్తుండవుగాక మన్మథునిచే లాగఁబడక విషయములచే నాకర్షింపబడక కాగములచే నపహరింపఁబడక ధీరుండవై యుండవలయును.

మఱియుఁ బండితునైనను నబిజాతునైనను ధీరునైనను పురుషుని దుర్వినీత యగు నీ రాజ్యలక్ష్మి ఖలునిగాఁ జేయును. కావునఁ బలుమా రీమాటలఁ జెప్పుచుంటిని. నీవిఁక నవయౌవనరాజ్యాభిషేక మంగళం బనుభవింపుము. దిగ్విజయముఁ జేయుము.శత్రునృపతుల తలలు వంగజేయుము. బంధువుల నాదరింపుము. కులక్రమాగతులగు బంధుమిత్రభృత్యదాసదాసీజనంబుల విడువకుము. కలలోనైనను దుర్జనుల సమీపమునకు రానీయకుము. సర్వదా సాధుసంగమము గలిగి వర్తింపుము. పూర్వాచారముల నాక్షేపింపకుము. అని దండనీతి యంతయు నుపదేశించి రాజ్యమంతయు మంత్రులతోఁ గూడ నతనియధీనముఁ గావించి మహామతియగు భట్టిని ప్రధానమంత్రిఁగాఁ