పుట:కాశీమజిలీకథలు -09.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమార్కుని రాజ్యప్రాప్తి కథ

191

వేయేండ్లు రాజ్యము చేసినను నెప్పటికైన నవసానమున్నదియా లేదా? సకలలోకనాయికవగు నీవు ప్రత్యక్షమై నన్నభినందించితి వింతకన్న మిన్న యేమున్నది. అయినను గోరుకొను మంటివి కావున నిన్నొకండు ప్రార్థించుచుంటి వినుము.

తల్లీ! నీవాదిశక్తివి. ఈ భూతకాలంబులన్నియు నీవు గన్ను మూసిన నశించును. కన్ను దెరచిన వసించును. ఇట్టి నీవు పెద్దపులివలె మృగబలి నాసించుట నాకు సిగ్గగుచున్నది. నేఁటి దుదనుండి యట్టి బలు లంగీకరింపనని నాకు వరంబిత్తువేని మహాసామ్రాజ్యప్రవాసముకన్న నెక్కుడుగా సంతోషించెద నిదియే నా యభీష్టమని పలికిన విని యాలోకజనని చిఱునగవుతో నన్ను మఱియు ముద్దుబెట్టుకొనుచు బాలకా? నీకీ మేలు బద్దులెక్కడ కలిగినవి. ఆహా నీ సుగుణంబులు గణనీయంబులని పొగడుచు నిట్లనియె.

కుమారా! నీకు నిజము చెప్పుచున్నాను వినుము. గతానుగతికోలోకః? అను నార్యోక్తి వినియుంటివా? పశబలియిండు మీయభీష్టములఁ దీర్తునని నేనెవ్వరితో నైనఁజెప్పితినా? ప్రజలందరు నిజము దెలిసికొనలేక ఫలాపేక్షంజేసి యొకరు చేసిన పనియే రెండవవారు చేయుచుందురు. అంతియకాని యది మదాదేశము కాదు. అయినను నీవడిగితివి కావున నింతటినుండి యిందట్టిపని జరుగకుండ శాసించెదనని పలికి యద్దేవి యంతర్హితురాలైనది.

ఇంతలో మీరు నాచేరువకు వచ్చిరని యెరింగించుటయు విని భట్టి హర్షపులకితగాత్రుండయి యతనిం గౌఁగలించుకొని రాజపుత్రా! నీయట్టి యుత్తములకు మిత్రుల మని చెప్పికొనిన మాకు విఖ్యాతిగలుగు. నీ వఖండసామ్రాజ్యధురంధరుఁడ వయ్యెదవని పెద్దగా వినుతించెను.

అని యెఱింగించి పైకథ పైమజిలీయందుఁ జెప్పందొడఁగెను.

199 వ మజిలీ.

విక్రమార్కుని రాజ్యప్రాప్తి

శ్లో॥ ఉత్సాహసంపన్న మదీర్ఘసూత్రం
     క్రియావిధిజ్ఞం విపయేష్వసక్తం
     శూరం కృతజ్ఞం దృఢనిశ్చయంచ
     లక్ష్మీ స్వయం వాంఛతివాసహేతోః.

మహేంద్రాదిత్యుఁ డొకనాఁడు భార్యతో దేవీ! చిరంజీవి ప్రాయంబునఁ జిన్నవాఁడైనను సద్గుణగణంబులచే లోకుల నాకర్షించుచున్నవాఁడు. మనపట్టిని యౌవనరాజ్యపట్టభద్రుని జేయుమని ప్రజలు నన్నూరక నిర్బంధించుచున్నారు. దేశదేశములనుండి పిల్లల నిత్తుమని చక్రవర్తుల వార్తల నంపుచున్నారు. స్వయంవరవిధిమూలముగా గాని వివాహమాడనని భట్టిముఖముగాఁ దెలియఁజేసియున్నాడు. మఱియు