పుట:కాశీమజిలీకథలు -09.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దుడుకుపట్టి ఎందున్నవాడని యడుగుచుండ నక్కుమారుండు వినయనమితోత్తమాంగుడై యతనిదండ కరుదెంచి నమస్కరించుటయు దీవించుచు గౌగిటం జేర్చీకొని యిట్లనియె.

అమ్మయ్యా! ఇప్పటికి నా డెందము కుదురుపడినది. అబ్బా! యీక్షణ మెవ్వరిని బాధించితినో నాపరితాప మిట్టిదని చెప్పజాలను. భట్టీ! ఇటురా; ఏమి జరిగినది? ఉట్టికోసెనా; కోయకుండ మరలెనా? అని యడిగిన భట్టి యిట్లనియె.

మహారాజా! అతండు పట్టినపట్టు విడచునా? ఉట్టి కోయకుండ దిగువాడే బాబూ వీనిస్నేహము జేయగూడదు. చెట్టెక్కి యుట్టికోయవలదని యెంత బ్రతిమాలినను వినిపించుకొనక చిరునగవుతో నాయుట్టిలో గూర్చుండి యించుకయు సంశయింపక వెరవక భయపడక యెడమచేత నాయుట్టి త్రాళ్ళన్నియుం గలిపి పట్టుకొని కుడిచేత గటారిం బూని పరపర గోసిపారవైచెను.

అప్పుడు తళుక్కుమని యొకమెఱుపు మెరసినట్లై మాకన్నుల జీకటి గ్రమ్మినను ముహూర్తకాలము మాకేమియు గనంబడలేదు. అందు లట్ల నిలువంబడితిమి అంతలో మా మిత్రుండు శూలము పాలుగాక తటాకతీరంబున గ్రొత్తవన్నెతో నిలువంబడి యుండ బొడగంటిమి. పరుగున బోయి కౌగలించుకొంటిమి. ఇంతియ మే మెఱింగినది తరువాయి కథ యతండే చెప్పవలయునని పలికిన విని యా నృపతి పోనిమ్ము ఆపద దప్పినదికదా. పిమ్మట జెప్పునులే యని పలికి యప్పుడింటికిం దీసికొనిపోయెను.

మహాకాళి రాజకుమారునికిఁ బ్రత్యక్షమై యనేకవరంబు లిచ్చినదని పౌరులెల్ల వింతగాఁ జెప్పుకొనుచుండిరి. ఆ వార్తవిని మరునాఁడు. భట్టివిక్రమార్కునితో వయస్యా! నిన్న నుట్టి కోసినపిమ్మట నేమిజరిగినదియో మాకుఁ దెలియలేదు. అమ్మవారు ప్రత్యక్షమై నీకు వరంబులిచ్చినదని గ్రామములోఁ జెప్పుకొనుచున్నారు. మా కప్పుడు కన్నులు జీకట్లఁ గ్రమ్ముటచే నేమియుం దెలిసినది కాదు. ఇంతలో మీతండ్రి ని న్నంతఃపురమునకుఁ దీసికొని పోయెంగదా! ఏమి జరిగినదియో యథార్థము జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

మిత్రులారా! వినుండు ఉట్టిం గోసి నే నాత్రిశూలాగ్రమునం బడఁబోవు నంతలో నా మహాకాళి దయారస పూరితచిత్తయై మెత్తని తన చేతులు రెండును సాచి నన్నందుఁ బడకుండఁ బట్టికొని పాదపీఠమునకు లాగికొనుచు ముద్దుపెట్టుకొని యుప బాలించుచు వత్సా! నీ సాహసదైర్యస్థర్యములకు సంతసించితిని. నీకు సాహసాంకుఁ డని బిరుద మొసంగితిని. వేయిసంవత్సరము లవిచ్ఛన్నముగా నీరాజధానిఁ బాలింపఁగలవు. నీకీర్తి మూఁడులోకంబులు వ్యాపింపఁగలదని పలుకుచు నీ యభీప్పితంబులం దెలుపు మొనగూర్తునని యడిగిన స్తుతిపూర్వకముగా నేనిట్లంటి.

అంబా! అస్థిరంబులగు భోగంబులయందు నా మనసభిరుచి వహింపదు.