పుట:కాశీమజిలీకథలు -09.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉట్టికోసిన కథ

189

    వటభూజాతము నెక్కి విక్రముఁడు దుర్వారంబుగానుట్టి చెం
    గటకుం బోయెఁ దదాప్తు లొక్కట మహాక్రందంబుగావింపగన్.

అప్పుడు భద్రాయుధుం డవ్విధంబు తండ్రి కెఱింగింప నతిరయంబున రాజమందిరంబునకుం బరుగిడుకొని పోయెను. శ్రీధరుండు అయ్యో! అయ్యో! ఎట్టి సాహసము. ఎంత ముప్పు, త్రిశూలాగ్రమున బడినఁ బ్రతుకుదువా? ప్రాణమిత్రమా? మిత్రుల విడిచిపోయెదవా వలదు. వలదు నిలు నిలు దిగు దిగు మని యేడ్చుచు నఱచుచుండెను.

భట్టియు వయస్యా! శ్రీధరుఁడు నీ నిమిత్త మెట్లు దుఃఖించుచున్నాడో చూడుము. నాదెస జూడవేమి? ఇఁక మాతో మాటాడవా? ఇంత యక్కటికములేని వాఁడ వైతివేమి? అయ్యో? ఈపూజారి తనకు శిరచ్ఛేదమగునని పరితపించుచున్నాడు. జాలిగలవాఁడవు నా కొరకైన నీయుద్యమము మానుము. కత్తితీయకుము తీయకుము చేతులు కోయకుము. ఆ ఆ. నిలు నిలు నాతో మూడుమాటలాడి నీయిష్టమువచ్చినట్లు చేయుము. క్షణములో మనకు వియోగము గలుగుచున్నది. యొక్క మాటయైన నాడి యుట్టి కోయుము. తండ్రీ! నీయట్టియాప్తుండు మాకు దొరకునా? అని దుఃఖింప జిరునగవుతో వెఱ్ఱివారలు మీ కీయాతురతతో బనిలేదు. నేనెందుబోయెద శోకింపకుడని పలుకుచు నుట్టిలో గూర్చుండి త్రాళ్లు సవరించుకొనుచుండెను.

భద్రాయుధుం డతిరయంబున బరుగిడికొనిపోయి మహేంద్రాదిత్యునితో మహారాజా! నీ కుమారుండు కాళికాలయంబునకుం బోయి మఱ్ఱికొమ్మకు వ్రేలంగట్ట యున్న యుట్టి యెక్కి దాని త్రాళ్ళు గోయ యత్నించుచున్నాడు. మే మెంతచెప్పినను వినలేదు. త్రాళ్ళుతెగిన, గ్రింద తటాకములోనున్న శూలాగ్రముపై బడి ప్రాణములు విడుచును. వేగవచ్చి వారింపుడని కేక పెట్టెను.

ఆ మాట విని యా యొడయడు పిడుగుపడిన ట్లడలుచు నేమీ! ఏమీ. విక్రముఁ డాగుడిలోని కెట్లు పోయెను. ద్వారపాలు రెట్లు పోనిచ్చిరి. వీడు దుడుకువాడనియే యట్టిశాసనము గావించితిని. అయ్యో! అయ్యో! అని యరచుచు నొండు విచారింపక వీథింబడి పరుగిడ దొడంగెను. పరివారము గుంపుగా వెంటబడినది. వారువపురౌతులు గుఱ్ఱములెక్కి ముందు పరుగిడిరి. పౌరులందఱు పరితాపముతో నాకోవెలదెసకే పరుగిడుచుండిరి.

యమ్మేదినీపతి పాదచారియై కొంతదూరము పోవువఱకు గుఱ్ఱపురౌతు లెదురువచ్చి జయమహిరాజా? యువరాజు కుశలియైయున్నవాడు అని చెప్పిన విని యతడు వారికి బారితోషిక మిచ్చి మెల్లగా నా యాలయంబునకుం బోయెను.

ఆహా! ఏమి సాహసము. ఏమి ధైర్యము. ఏమి చొరవయని జనులూరక విక్రమార్కుని సుగుణంబులం బొగడుచుండిరి. తత్ప్రదేశమంతయు బౌరులచే నిండింప బడినది. జనుల దప్పించుకొనుచు మహేంద్రాదిత్యుడు అల్లన లోనికింబోయి యేడీ?