పుట:కాశీమజిలీకథలు -09.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

మువ్వురు మిత్రులు నతని యొద్దకుఁ వచ్చిరి. శ్రీధరా! రాత్రి యర్చకునితోమాట్లాడితివా? ఏమనియెనని యడిగిన నతండు రాజపుత్ ! అర్చకుఁడు మొదట నేమో చెప్పఁబోయెంగాని నీ యుంగర మందిన వెనుక మోము వికసింప మనరాక కంగీకరించి యుదయభోగసమయమునకే రమ్మని చెప్పెను.

వేళయైనది పోవుదము లెండని పలికిన విని సంతసించుచు రాజపుత్రుండు లోపలఁ బట్టుపుట్టంబులం గట్టికొని పైనంగీలు దొడగి యుపహారములఁదెమ్మని నియోగించి పూజారి యెఱింగించినతఱి నమ్మవాఱి యుత్తరగోపురము దరికిఁ బోయి నిలువంబడియెను. వారి రాకకై యెదురుచూచుచున్న యర్చకుడు రాజపుత్రు నమస్కారము లందికొని చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు ద్వారపాలునితో నీ బాలుని దేవతాదర్శనమునకై తీసికొని పోవుచున్న వాఁడ నితండు భర్తృదారకుం డెఱుఁగుదువా? అని పలికిన విని వాఁడు లేచి నమస్కరింపుచు స్వామీ! రాజశాసనము మీరు వినలేదా? సెలవు లేనిదే రాజపుత్రాదుల నీ యాలయములోనికిఁ బోనీయవలదని ప్రభు డాజ్ఞా పత్రిక పంపియున్నాఁడు. పోనిచ్చిన మాకు మాటరాదా? అనుటయు నర్చకుండు సరిసరి మాటలకు నేమిటికి? వెంటబెట్టుకొని తీసికొనిపోయి యమ్మవారి దర్శనముఁ జేయించి యిప్పుడే తీసికొని వచ్చెద నింతలో నేమి యుపద్రవ మున్నది. ఇఁక కొలది కాలములో నీతండే మనకు ప్రభువు. ముందు వెనుక విచారించి యదలించిన వాఁడు జడియుచు స్వామీ! యొరులకుం దెలియకుండ వేగము తీసికొని రావలయుం జుఁడీ యని పలుకుచు సలాము జేసి వారిని లోపలికిం బోనిచ్చెను.

అప్పు డాయర్చకుండు వారివెంటఁ బెట్టుకొని తీసికొనిపోయి లోపలి విశేషములన్నియుం జూపుచు వేఱువేఱ నాయాదేవతావిశేషముల తెఱగెఱిగింపుచు గోపురప్రాకారమంటపాదుల గట్టింటినవారి పేరులు శిలాశాసనంబుల జదివి వినిపించుచుఁ బ్రదక్షిణపూర్వకముగా గర్భాలయంబునకుఁ దీసికొనిపోయి కర్పూరము వెల్గించి దేవీవిగ్రహవిశేషంబులన్నియుఁ జూపుటయు నా నృపనందనుం డమందానంద తుందిల హృదయారవిందుఁడై సాష్టాంగనమస్కారము గావింపుచుఁ జేతులు జోడించి నిలువఁబడి యమ్మహాదేవి నిట్లు వినుతించెను.

 
శ్లో॥ జయమహిషాసుర మారిణి దారిణి రురుదానవస్య శూలకరే
     జయ విభుభోత్సవ కారిణి ధారిణి భువనత్త్రయస్య మాతృవతే
     జయజగదభినుతచరణే శరణే నిశ్రేయసస్య భక్తానాం
    జయథృత భాస్కర కిరణే హరణే దురితాంధ కారబృందానాం॥

క. దేవీ! నీపదయుగరా
   జీవంబుల భక్తివెలయ సేవింతు సదా
   భావంబున నీభక్తునం
   గావుము నన్నె పుడు భద్రకాళీ! కాళీ