పుట:కాశీమజిలీకథలు -09.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24]

ఉట్టికోసిన కథ

185

ద్రిజాలాగ్రమగు నుక్కుకంబమొకటి గన్పట్టుచున్నది. ఆ ప్రదేశమున నింక ననేకవిచిత్రము లున్నవని చెప్పుదురు. నన్నాదెసకు బోనిచ్చిరికారు. అని శ్రీధరుఁ డాకాళికాలయములో నున్న వింతలన్నియు నెఱింగించెను.

విక్రమార్కుండు విని యోహా! యిన్ని విశేషములు మన యూరనుండ నెన్నడుం జెప్పితిరి కారే? కానిండు నేఁడందుబోయి చూతము రండు. లెండు లెండని పలికిన విని భట్టి యిట్లనియె. మీ తండ్రిగా రేకారణము చేతనో మనల నందు రానీయవలదని యాజ్ఞాపించినారఁట. ఱేని యానతి లేనిదే మనమెంత వారమైనఁగావలి వారందుఁ బోనిత్తురా? కావున ఱేపు ప్రొద్దున్న నర్చకుల నాశ్రయించి వారివెంట లోనికిఁ బోవుదము గాక. ఇప్పుడు పోవలదని యుపాయము జెప్పిన నామాట కందఱు సమ్మతించిరి. అర్చకుల నే నెఱుంగుదు. మా యింటి ప్రక్కనే వారి లోగిలి. ఈ రాత్రియే మాటాడి యుదయంబున లోపలికిఁ దీసికొని పొమ్మని యడిగెద ననుటయు విక్రమార్కుండు తన వ్రేలియుంగర మొకటిఁ దీసి యిది యా యర్చకునికిఁ గానుక యిచ్చి యభీష్టము దెలుపుము. అంతయు నతండే చేయఁగలఁడని చెప్పి యా యంగుళీయక మతని కర్పించెను అందఱు లేచి నిష్క్రమించిరి.

అని చెప్పి యచ్చటికిఁ గాలతీతమగుట మణిసిద్ధుండు అవ్వలి కథ పైమజిలీయందుఁ జెప్పఁ దొడంగెను.

198 వ మజిలీ

ఉట్టికోసినకథ

విక్రమాదిత్యుని సౌందర్యము త్రిభువనాశ్చర్యకరమైయున్నది. కంతు వసంత జయంతాదు లతనితోఁ బోల్చఁదగరు. అతని సుగుణంబులు వర్ణింప సహస్రముఖునికైనఁ బెద్దకాలము పట్టును. పండ్రెండేఁడుల వయసునాఁటికే సకలవిద్యలు గ్రహించెను. చెక్కుటద్దముల వంటి బుగ్గలు గిల్లిన పాలు గారుచుండెను. మీసము లైన రాలేదు. కొరమ తుమ్మెదలం దెగడు నిగ నిగని కురు లరుదుగ వెనుక జీరాడ మొలగుపై కెగసివచ్చిన చంద్రబింబంబు డంబున నతని మొగంబు మెరయుచుండెను. నవ్విన రదనద్యుతు లెల్లెడ వ్యాపింప ముద్దులు మూఁటగట్టుచుండును. పలికినఁ దేనె లొలుకు చుండును. ఆకర్ణాంతవిశాలములగు నేత్రములు విప్పి చూచినఁ గరుణారసము దొప్పఁదోగుచుండును. అతండు వీరపురుషవేషముతో నశ్వారూఢుండై రాజమార్గంబున నఱుగుచుండ నిత్యము క్రొత్తవానివలె మత్తకాశినులు చిత్తజాయత్తచిత్తులై వింతగాఁ జూచుచుందురు.

ఎప్పుడు తెల్లవారు నెప్పు డాకాళికాలయము జూతునని తలంచుచు విక్రమార్కుడు నిద్రగన్నుల నారాత్రి నిద్రయేపోలేదు. తెల్లవారినతోడనే యతండు నిత్యకృత్యములం దీర్చుకొని వాడుకప్రకారము స్నానముఁ జేసి జపముఁ జేసికొనుచున్న సమయంబున