పుట:కాశీమజిలీకథలు -09.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమార్కుని కథ

181

యొడయడు పరితపించుచు మహేశ్వరు నారాధించుటయు నమ్మహాత్ముండు స్వప్నంబున సాక్షాత్కరించి నరేంద్రా! నీయంతశ్శుద్ధికి సంతసించితిని. ప్రమథగణ ప్రముఖుండగు మాల్యవంతుని యంశంబున ద్రిలోకవిఖ్యాతుండగు సుతుడు నీ కుదయింప గలడు. రాక్షసాంశమువలన బుడమి జనించిన తుచ్చమ్లేచ్చులనెల్ల వధియింపగలడు. మఱియు యక్షరక్షః పిశాచాదులు భూతభేతాళాదులు వానివశంబున నుండగలవని యానతిచ్చి యా మృత్యుంజయుం డంతర్హి తుడయ్యెను.

మేల్కలగని మేల్కొని యజ్జనపతి యపరిమిత సంతోషముతో మనీషులకు నూత్నరత్నభూషాంబరాది పారితోషికములిచ్చి పుత్త్రోదయమునుగురించి ముచ్చటింపుచుండ దత్వన్ని యంతర్వత్నియై శుభలగ్నంబున బుత్రరత్నమును గనినది. జన్మకాలలగ్నద్రేక్కాణహోరాదులం బరీక్షించి వీడు త్రిలోకవిఖ్యాతయశుం డగునని తెలియపరచిరి.

మహేంద్రాదిత్యుండును బుధజనస్తుత్యపురుషాపత్యసంప్రాప్తిం జేసి యుల్లాసము జెందుచు భూసురులకు షోడశమహాదానములం గావింపుచు జాతకర్మానంతరమున,

క. శోధించి విక్రమంబున
    నాదిత్యుం బోలుకతన నన్వర్థముగా
    భూధవుడు పెట్టె బట్టికి
    నాదరమున బేరు విక్రమాదిత్యుడనన్.

మఱియు గులక్రమాగతుడగు సుమతియను ప్రధానమంత్రికి మహామతి యనియు, భట్టియనియు నామంబులు గల పుత్రుండును పురోహితునికి శ్రీధరుండను నందనుండును ద్వారపాలుడు వజ్రాయుధుండను వానికి భద్రాయుధుండను పుత్రుండును జనించిరి. ఆ మువ్వురను రాజపుత్రునితో జతపరచి యా నరేంద్రు డాహారవిహారశయ్యామజ్జనక్రీడావిశేషాదు లొక్కచోటనే జరుగునట్లు నియమించి యుచితకాలంబునం జదువవేసి యుపాధ్యాయులవలన గ్రమంబున సకలవిద్యలు నేర్పించుచుండెను. గురువులు నిమిత్తమాత్రమునకేకాక విక్రమాదిత్యునకు వారివలన నించుకయు బ్రయోజనము లేదు. సమస్తవిద్యలు నోజోబలతేజంబులు అహమకహమికగా వచ్చి యతని నాశ్రయింపుచుండెను. మఱియు,

సీ. వేదశాస్త్రపురాణ వివిధాగమంబులు
                కరతలామలకంబుగా నెఱింగె
    నవరసోజ్వలకావ్యనాటకాలంకార
                సమితి నామూలచూడముగ జూచె
    ధర్మార్థకామశాస్త్రప్రపంచంబులు
               పల్లవిపాటగా బరిచయించె