పుట:కాశీమజిలీకథలు -09.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

విసువు నసూయము జనింప నాఁడు వాడుకప్రకార మా పర్ణశాలకుఁ బోయి పెద్దతడవు సిద్ధుం బ్రార్థించి సీ! ఇక నా బ్రతుకేల,

క. పోవంగావలెఁ బోయిన
    దేవేంద్రుని లోకములకు ధృతికాదేనిం
    జావం గావలెఁ బ్రబల
    గ్రావాదుల నిట నటంచుఁ గడు తెగువమెయిన్.

ఒక పెద్ద పాషాణముపై శిరంబువైచి వ్రక్కలుసేయ నుంకించునంతలో నా ప్రాంతమున ఆ! ఆ! మూర్ఖా! నిలు, నిలు, బలవన్మరణంబు పాపహేతువుకాదా అని యెవ్వరో పలికినట్లయినది. ఆ ధ్వని విని నేనా యుద్యము మాని తలయెత్తి నలువంకలు సూచుచుండ నీ యభీష్టమేమి చెప్పమను మాట మఱియొకటి వినంబడినది. అప్పుడు నేను జేతులు జోడించి మహానుభావా! నీకు నేటికి నాయం దనుగ్రహము గలిగినదియా? నా కామితం బిదివరకే చెప్పియుంటిని. నా మిత్రుడు మోహనుని కిచ్చిన పాదలేపనమే నాకిమ్ము. పుణ్యలోకముల జూచి వచ్చెదనని పలుకుచుండగనే యొక బరిణి నా ముందర బడినది. నేనది యందుకొని మూత దీసిచూడ బసరుతో జేసిన కాటుక యందున్నది. అదియే పాదలేపమని నిశ్చయించి పరమసంతోషముతో నా బరిణి మూటగట్టుకొని భయంకరమగు నాపర్ణశాలలోనికి బోయి చూచితిని. కాని యెవ్వరు గనంబడలేదు.

సిద్ధుండు దర్శన మీయకయే యభీష్టము దీర్చె నెట్లయిన లెస్సయే యని నిశ్చయించి చెచ్చెరం గాశీపురంబునకు వచ్చి విశ్వనాథు నాలయంబునకుబోయి స్వామికి మ్రొక్కి మణికర్ణికాతీరంబు జేరి యాకసము వంకజూచుచు నీవుపోయిన నక్షత్రమునకు బదిబారలదూరములో నున్న మఱియొక చుక్కం గురిచూచి పాదలేపనము గొంత పాదములకు రాచికొని కన్నులు మూసికొని యానక్షత్రముకడకు బోవలయునని తలంచి కన్నులం దెరచిచూడ నెక్కిడికిం బోక యందేయుంటిని.

పిశాచలోకము కథ

ఓహో నన్ను సిద్ధుండు మోసముజేసెనా? కాటుక చాలినది కదా? ఈ మాటంతయును రాచి చూచెదంగాక యని తలంచి వెండియు నిందున్న కాటుకనంతయు బాదములకు రాచికొని కన్నులు మూసికొని ధ్యానించినంత లోకాంతరమున కరిగినట్లు తోచినది. కన్నులు దెరచి చూడ నది భూలోక విలక్షణమగు భువనముగా దోచినది. అది పిశాచలోకమట. కర్మననుసరించి బుద్ధి నొడముచుండునుగదా! ఇన్ని నక్షత్రములుండ నా లోకమే పోవుడకు గనంబడవలయునా? అదియు గంధర్వాదిలోకములలో జేరినదియే. ఇంద్రునిచే బాలింపబడు పుణ్యలోకమే కాని యందు దమోగుణ