పుట:కాశీమజిలీకథలు -09.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

భాగ్యము వీరికెట్లు కలిగినదో తెలిసికొనవలయునని యాలోచించుచు నొకనాడు ఆ కాపువాని పెద్దకుమారు నెనిమిదేండ్లవానింజీరి యోరీ! మీకు నిత్యము ఈ పిండివంటకము లెక్కడివి! మీ యమ్మ వండుచున్నదా? అని యడిగిన వాడిట్లనియె.

ఇవి మా యమ్మ వండుటలేదు. మా యయ్య ముసురుపట్టిన నొకదినం బడవికి బోయి పొడికట్టెలు దొరకక విచారించెనట. ఒక చావడిలో నమ్మవారున్నదట. దాని నెత్తిమీద గొడ్డలితో గొట్టబోయిన గొట్టవద్దనిచెప్పి కుండలుతెచ్చి మూతవేసి తీసిన బూరెలు గారెలు నన్నము నిండియుండునని జెప్పినదట. అట్లు చేయుచున్నారు. కుండలు నిండుచున్నవని యా పిల్లవాడు తలిదండ్రు లనుకొనిన మాటలు విని యున్నకతంబున నారహస్య మా మండోదరికి జెప్పివేసెను.

ఆ ధూర్త యావర్తమానమువిని మేలు మేలు యా కూలిదాని యదృష్టము పండినది వంటయైన జేయనక్కరలేదు. నిత్యము పిండివంటలతో భోజనం జేయవచ్చు. నాకీ దిక్కుమాలిన కాపుర మెక్కడ వచ్చినదో యే సుఖములేదు. తెల్లవారినది మొదలు వంటపని వార్చుపని సరిపోవుచున్నది. చేయూత యిచ్చువారైనలేరు. అని తలపోయుచు చిర్రు బుస్సుమని బిడ్డలేదో యడుగవచ్చిన గొట్టుచు జట్టి పగులగొట్టుచు బుట్టల దన్నుచు మగడు వచ్చుసరికి రట్టుచేయుచు వంటజేయక యందరిం దిట్టు చుండెను.

వంట యైనదా? అని మగ డడిగినతోడనే ఆ, అయినది తిందుగానిరా; ఎందుకు నీ పుట్టుక మగవాడవను మాటయేకాని యాడుదానికన్న గనిష్టుడవు ఏ పనియుం జేతగాదు. నేనిక వండలేను. వంటవాండ్రం బెట్టుకొనుము, లేకున్న మానుడని దురహంకారముగా బలికిన నతండు నే డేమి వచ్చినది? మీ యమ్మ యిట్ల లుగు చున్నదేమని పిల్లల నడిగిన వాండిట్లరి.

అమ్మ ప్రొద్దుననుండి యిట్లే తిట్టుచున్నది. అన్న మడిగిన మమ్మందర జావగొట్టినది. మమ్మేగాక కుండలం గొట్టినది. ప్రొద్దుట నా కాపువాని కుమారునిం జీరి యేదో యడిగినది. వాడేమి చెప్పినో తెలియదు. అప్పటినుండి యిట్లు రట్టు చేయుచున్నదని చెప్పిరి.

అప్పు డతండు మమ్మేల దిట్టెదవు? నీ యభిప్రాయ మేమియో చెప్పుము. నీవు చెప్పినట్లు చేయకున్న యప్పుడు నిందింపుమని బ్రతిమాలికొనగా కాపుపట్టిచెప్పిన కథ యంతయుం జెప్పి యిప్పుడు నీవందుబోయి యా యమ్మగారిం గొట్టబూనుము. ఏమి కావలయునని యడిగిన వానికివలెనే మనకుగూడ బదార్ధము లుత్పన్నము లగునట్లు కోరుము. అందుల కొడంబడితివేని యిప్పుడు వంటజేసెద లేకున్న బస్తుండుమని చెప్పిన విని యా యజమాను డించుక యాలోచించి యిట్లనియె.

ఓసీ! నీ మాట వడుపున గావించెదగాని నాసలబొందక వినుము ఏ వేల్పైన సేవించిన వరం బిచ్చునుగాని కొట్టబూనిన వరమిచ్చునా? ఇందుల కేమందు