పుట:కాశీమజిలీకథలు -09.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నతని మెల్లన లేవనెత్తి తదవస్థకు దుఃఖించుచు మెల్లన గుఱ్ఱముపై నెక్కించి తాను గళ్లెముఁ బట్టుకొని గుఱ్ఱమును నడిపించుచు నింటికిం దీసికొనిపోయి పరుండఁబెట్టి యెవ్వరితో మాటాడనీయక తానే వాని కుపచారములు సేయఁబూనెను. సిద్ధార్థుఁడు చచ్చినంత పాటుపడి వచ్చెనని పట్టణమంతయుఁ జెప్పుకొనుచుండెను.

అతని రాకవలన దలితండ్రులే కాక ప్రజలందరు నుత్సవములు సేయఁ బూనిరి. నాలుగుదినములకు సిద్ధార్థునకు మాటాడుటకు సామర్థ్యము కలిగినది అప్పుడు రాజపుత్రుఁడు రహస్యముగా నీకీబంధనప్రాప్తి యెట్లు కలిగినదో చెప్పుము. అని యడిగినఁ గన్నీరుఁ గార్చుచు సిద్ధార్థుం డొక రహస్యప్రదేశమునఁ గూర్చుండఁబెట్టి తనకథ నిట్లు చెప్పదొడంగెను.

196 వ మజిలీ.

మండోదరికథ

ఉ. ఎవ్వఁడు తొంటిజన్మమున నెట్టితపోవ్రతదానధర్మముల్
     నివ్వటిలంగఁ జేయునొ ఫలించును తత్సమభోగభాగ్యముల్
     నివ్వెఱఁ బూర్వపుణ్యములు లేక దివంబున కేగ మేరువుం
     ద్రవ్వి శిరంబుమీఁద నిడిన న్బరువై పడుఁ గాక నిల్చునే.

వయస్యా! ముందుగా నీకు నా యుదంతమును బోలినచిన్నకథ యొక్కటి చెప్పెద నాకర్ణింపుము.

మాంగళిక యను గ్రామంబునఁ బింగళకుండను కాఁపు కాపురముఁ జేయుచుండెను. వాని కెందరేని పిల్లలు గలరు. తినఁ గూడులేదు. విప్పచ్చరము బాధింపఁ బిల్లలం బెనుప నేయుపాయంబు దోపక యడవికిం బోయి కట్టెలం తెచ్చి గ్రామములో నమ్ముచు దాన వచ్చినసొమ్మునఁ బొదుపుగాఁ గుటుంబమును బోషించుకొనుచుండెను.

ఒకనాఁడు వాఁడు వేకువజామున లేచి గొడ్డలి భుజముపై నిడుకొని పొలమునకుఁ బోవుచుండఁ జినుకు జినుకుగా నుండియుండి క్రమంబున బలసి ధారాపాతముగా వర్షము గురియఁ జొచ్చినది. వాఁ డాయడవిలోఁ దిరుగుచుండ దారునిగ్గితమైన యొక యమ్మవారున్న చావడి గనంబడినది. అందు నిలుచుటచే వానికి వర్షబాధ యంతగాఁ గలుగలేదు. కాని మఱియొకబాధ హృదయంబున నావిర్బవించినది.

అక్కటా? ఈవానకుఁ దుది గనంబడదు. వలసిన దారువులన్నియుఁ దడిసినవి. మధ్యాహ్నము కావచ్చినది. ఒక్కకట్టెనైను సమకట్టలేకబోయితిని. నేఁడు కావడి తీసికొనిపోక యూరక యింటికిఁ బోయినఁ బిల్లల కన్న మెట్లు దొరకును. పిల్ల లన్నమునకై యేడ్చుచుండ నాభార్య నారాక కెదురుటచూచుచుండును. ఏమిచేయుదు దైవమా? యని ధ్యానించుచు దారుస్థంభముగా నిల్వబడియున్న యమ్మవారింజూచి మురియుచు నిట్లు తలంచెను.