పుట:కాశీమజిలీకథలు -09.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నంగీకరింపక వానినిగూడ నింటికిరమ్మని బలవంతపరచెను. సిద్ధార్థునికి హృదయంబున నొకవిధమగు విచార మంకురించినది. మోహనుని భార్యల సౌందర్యములు తలఁచి యాహా! అట్టిభార్యలు లేనివాని బ్రతుకేమియని చింతించును. మోహనునియందు నసూయలేదు కాని తన కట్టివైభవము పట్టినది కాదని ధ్యానించుచుండును. మోహనుండును ఎరమరికలు లేకుండునట్లు తనభార్యలచే నతని కుపచారములు సేయించుచుండెను. వారిం జూచినంత వానిచింత మఱింత హెచ్చుచుండెను.

సీ? నాదొక జన్మమే? నేను మోహనునితో సమానముగాఁ బెరిగితిని. సమానముగాఁ జదివితిని.. బుద్ధిబలంబున సమానుడఁ ననిపించుకొంటిని, వాఁడు తపస్వి వెంట దేశాంతర మరుగచుండ ననదవలె నింటికడ వసించితిని. ముసలమ్మవలె వృద్ధదంపతులఁ గనిపెట్టుకొని యుంటిని.

వీఁడున్నట్లె యుండి పోయినట్లె పోయి దివ్యభోగము లనుభవించి దివ్యకన్యల స్వీకరించి వచ్చెను. వాని పుణ్య మట్లున్నది. నాకర్మ మిట్లున్నది. సంపాదింపవలె లేకున్న నీగంగలోఁబడి చావవలయును. ఇంటికిఁ బోయి వానివెంట వెంటఁ దిరుగుచు వాని భార్యలం జూచి యువ్విళ్లూరిన డెందముతోఁ గొందల మందనేల? దాని ననుగ్రహించిన సిద్ధుండు నన్నేమిటి కనుగ్రహింపఁడు. అతం డుండుచోటు గురుతు జెప్పెను గదా? పోయి చూచెదంగాక యని మనంబున నిశ్చయించుకొని మోహనునితోఁ గొన్ని పయనములు పోయినట్లే పోయి యొకనా డెవ్వరికిం దెలియకుండఁ గాశీపురంబునకుఁ బారిపోయెను.

నాఁటి ప్రయాణసమయంబున మోహనుండు సిద్ధార్థుం గానంపరితపించుచు వెదకుచుండ మీవార్త ముందుగా మీ తలిదండ్రుల కెఱింగింప మహేంద్రనగరంబున కరిగెనని పరిజనుం డెవ్వఁడో చెప్పఁగా నిజమనుకొని యతండు హుటాహుటి పయనంబుల మహేంద్రనగరంబున కరిగెను.

ఇంద్రమిత్రుఁడు కాశీపురంబు నుండి సిద్ధార్థుఁడు వ్రాసినజాబు చూచినది మొదలు రాజ్యతంత్రములు మంత్రి యధీనముఁ జేసి పుత్రవియోగచింతాక్రాంతస్వాతుండై భార్యతోఁగూడ నిద్రాహారములు సేయక మంచము పట్టియుండెను.

అప్పు డెవ్వరో వచ్చి నీపుత్రుం డిరువురు భార్యలతో మహావైభవంబున వచ్చుచున్నాఁడని చెప్పినంత నత్యంతబలసంపన్నుండై యేమేమీ? నా మోహనుఁడే వచ్చుచున్నాఁడా? సిద్ధార్థుఁ డెఱింగించిన విషయ మసత్యమా యేమి? అని యాలోచించుచుండఁగనే మోహనుఁడు వచ్చి యతనిపాదంబులం బడి నమస్కరించెను.

నా కన్నతండ్రి వచ్చెనాయని లేచి గ్రుచ్చి యెత్తి యానందబాష్పములచేఁ గన్నులు నిండింపఁ బడ డగ్గుత్తికచే మాటాడలేక పెద్దతడ వూరకుండి వత్సా! నీ మిత్రుఁడు నీపై లేనిపోని నిందలు వ్రాసెనేమీ? వాఁడు వచ్చెనా? ఎందుఁ బోయితివి తండ్రీ అని యడిగినఁ గుమారుం డిట్లనియె.