పుట:కాశీమజిలీకథలు -09.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరృతిలోకము కథ

159

రాక్షసులకు దేవతలకు సమానవిరోధమైనను మనలోకమునందున్న దానవులయందుఁగల సాత్వికత్వము ననుసరించి మనకుసు వారికిని మైత్రియే యొప్పియున్నది. పాతాళతలవాసులగు నసురులు దుష్టక్రియాచరణదక్షులని మన మొప్పికొనక తప్పదు. అట్టివారితో మనలోకమందున్న దనుజులకు సంబంధబాంధవ్యంబులు గలిగియున్నవని వారికి దెలియకపోదు. దేవకాంతలఁ గామరూపులగు దానవులు చెఱపట్టుట యనాది సిద్ధమైన పనియేకదా? వినుండు.

తేజోలోకమున కీ నడుమఁ గామరూపుఁడగు దైత్యుఁ డొకఁ డరుదెంచి పుణ్యపురుషుండనని చెప్పి మూఁడుదినంబు లందుఁ దీర్ధశుల్కతోఁగూడ దివ్యభోగంబు లనుభవించి ప్రధానదండనాథుఁడగు మాణిభద్రుని ధిక్కరించి యతం డెఱుంగకుండఁ దీర్థశుల్క నెత్తుకొని పోయెనఁట. మఱునాఁడు నిజమైన పుణ్యపురుషుం దెచ్చి యందు ప్రవేశపెట్టిరి. తీర్థశుల్క లేదు. మాణిభద్రు డావార్త వృత్రారి కెఱింగించుటయు నతండది దైత్యకృత్యముగా భావించి నాకు వర్తమానము బంపి రప్పించుకొని నాతో నావృత్తాంత మంతయుం జెప్పి తప్పక రసాతలవాసులు నీలోకమునఁగల దానవుల కాప్తులై యున్నట్లు మాకుఁ దెలియవచ్చినది. మీలోకమందట్టి వా రెందున్నారో తెలిసికొని శిక్షించి యాతీర్థశుల్క నాలోకమునకుఁ బంపివేయుము, దానికి బదులుగా మఱి యొక యచ్చర నచ్చటి కనిపితిమన పలికిన విని వినిమితోత్తమాంగుడనై నే నిట్లంటి. మహేంద్రా! నేను నాపరిజనులు మీయాజ్ఞ కెప్పుడు బద్దులమై యున్నాము. నాలోకమందున్నవారు మహాశ్రోత్రియలవలె దయాసత్యశౌచాదులు గలిగి వర్తింపుచున్నారు మాలోకములో నున్నవా రట్టిపని చేయుదురని నే నమ్మఁజాలను. రసాతలవాసులు చేసినం జేయవచ్చును. వారినిగురించి విమర్శించి దేవరకుఁ దెలియఁజేసెదనని జెప్పి యనుజ్ఞ పుచ్చుకొని వచ్చినాఁడ నొక మూలమునుండి దేవేంద్రునితోపాటు దిక్పతి ననిపించుకొనుచు మర్యాదగ గాలక్షేపముఁ జేయుచున్నాను. వారికి వ్యతిరేకము జేసితినేని నా యుద్యోగము గడియలో మడియఁ గలదు, అసురాంతకుండు పూరాంతకుండు వారికిఁ బ్రాపుగా నున్నారు. మీరు మాటఁ దక్కించి యీ యధికారము నిలిపితిరా నిలుపుఁడు, లేకున్న విడుదల యిచ్చి నాదారి నేను బోయెదను. రసాతలవాసు లిందు వచ్చుచున్నారా? లేరా ? నిజము చెప్పుడని యడిగిన నందొక రాక్షసుండు లేచి మహాప్రభూ! వచ్చుచున్నారు. కర్ధముఁడను దానవుని యింటికి ముగ్గుర వెంటబెట్టుకొని దుర్ధముఁడను దానవుడు వచ్చెను. వారే యొక బాటసారిభార్య నెత్తికొని బోయిరఁట. నెత్తి మొత్తుకొనుచు నా తెరువరి నాతోఁ జెప్పెనని చెప్పుటయు నిరృతి యాకర్ధము డిందు వచ్చెనా? అని కేకవేయించుటయు రాలేదని సభ్యు లుత్తరము జెప్పిరి. కర్ధముని యెందున్నను వెదికి తీసికొని రావలయునని యాజ్ఞయిచ్చి నిరృతి యానాటికి నాసభ చాలించెను. అప్పుడు నేను లేచి నాభార్య నెత్తుకొనిపోయిన వార్తఁ చెప్పవలె ననుడు నాతడు దాని కర్దముని విచారించినప్పుడు జెప్పవచ్చునని నాతో నున్న