పుట:కాశీమజిలీకథలు -09.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

రంబులఁ బుణ్యలోకంబు లెల్ల దిరిగి యీ లోకము వచ్చినంతఁ దత్సామర్థ్యము సడలిన నడుచుచు నీ నగరంబునకు వచ్చుచుండ దారిలో నలుగురు రక్కనులు నాతోఁ గలసి మొన్నను నా భార్య నెత్తికొనిపోయిరి. ఆ పరిభవము నిరృతి మహారాజున కెఱింగింప వచ్చితినని నా యుదంతము కొంతమఱుఁగు పెట్ట యప్పటికిఁ దగినరీతి నెఱింగించితిని.

అతండు జాలిపడచు నయ్యా! నిరృతి నేఁటియుదయముననే యింద్రుండు వార్తనంప స్వర్గమునకుఁ బోయి వచ్చెను. మూఁడుగంటల కొక సభఁ జేయునఁట. అప్పు డందరిని రమ్మని పత్రికల నంపినాఁడు, ఎల్లుండి పుత్రికాస్వయంవరమహోత్సవము మఱి మూఁడు దినము లరిగినంగాని యాఱేఁడు నీతో మాటాడుట కవసర మీయుఁడు. అంతదనుక నీవు భద్రముగా మాయింటనుండుము. తరువాతఁ జూతువు గాక యని యాదరించి పలికిన విని నే నహహా! రాక్షసులననేమో యనుకొంటిని. ఇట్టి యుత్తములు మహర్షులలో సైతముండుట దుర్ఘటము. మీరు సేసిన యుపకార మెన్నటికి మరువనని స్తుతియించుచు మహాత్మా! రాజపుత్రిక కెన్ని యేండ్లున్నవి? ఆ స్వయంవరమున కింద్రుండు దిక్పాలురు సురలు వత్తురా? అని యడిగిన నతం డిట్లనియె.

అందఱకు నాహ్యానపత్రికలు పంపిరి. ఎవ్వరో వత్తురు నిశ్చయము. తెలియదు. ఈ చిన్నది సద్యోగర్భమునం జనియించి వృద్ధి బొందినది. ఏండ్లు లేకున్ననుఁ బదియారేండ్ల ప్రాయము దానివలె నుండును. మా ప్రభువున కిదివఱ కింత చక్కని పుత్రిక పుట్టియుండలేదు, విద్యావతియని పేరు పెట్టెను. ఆమె విద్యలతోనే పుట్టినదఁట. ఎవ్వని భాగ్యము పండినదియో తెలియదు. అని యతం డెఱింగించెను.

మఱియు మూఁడుగంటలకుఁ దానాసభకుఁ బోవుచు నన్ను రమ్మని తన బండిపైఁ నెక్కించుకొని యా యోలగమునకుఁ దీసికొనిపోయెను. ఆ సభ బ్రహ్మసభవలె మిక్కిలి శోభిల్లినది. బ్రహ్మతేజముతో నొప్పు రాక్షసులెల్ల నా సభ నలంకరించిరి. ఆహా! ఆ సభామధ్యంబున సమున్నతరత్నసింహాసనమున వసించియున్న నిరృతిమహారాజు నాకుఁ గన్నులపండువుఁ గావించెను. అతని మొగంబున శాంతమైన తేజంబు కళల నీనుచుండెను. విశాలములగు నేత్రకోణములనుండి వెల్వడిన చూపులు త్రిభువనప్రభుత్వలాంఛనమును సూచించుచున్నవి. సభ నిండినపిమ్మట నతండు లేచి యెల్లరు విన మేఘగంభీరస్వరంబున నిట్లుపన్యసించెను.

సభ్యులార ! అఖండలుం డకాండముగ నన్ను రప్పించిన కారణ మెఱింగించెద నాలింపుఁడు. మహేంద్రుఁడు మూడులోకంబుల కధికారి. దిక్పతులకెల్ల ముఖ్యుఁడు. పుణ్యలోకములఁ బాలించు ప్రభువు. ధారుణీతలంబునఁ బుణ్యములఁ గాంచిన సుకృతాత్ముల మరణావసరమందు విమానములతోఁగూడ దేవదూతల నంపి వారి నాయా పుణ్యలోకముల వసింపఁజేయ నధికార మాసురపతియందే యున్నది.