పుట:కాశీమజిలీకథలు -09.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తగ్గినది కాఁబోలు మేము వచ్చిన దేవయాన మంతర్థానమైపోయినది పాదచారులమై వచ్చుచుండ నీ పుణ్యాత్ముఁడు మాశ్రమరయ బండి యెక్కించి యిందు దీసికొని వచ్చెను. నిరృతి మహారాజుగారి జూచుటకుఁ బుణ్యవతీనగరంబునకుం బోవుచున్న వారమని యెఱింగించితిని.

నా మాటలు విని వారేదియో గుజగుజలాడికొనిరి. భోజనానంతరమునఁ చావడిలో గూర్చుండి తాంబూలములు వైచికొనునప్పు డయ్యింటి యజమానుఁడు నాతో నయ్యా! పుణ్యవతీ నగరంబునఁ బదిదినములలో గొప్పసభ జరుగనైయున్నది. రాక్షస రాజపుత్రికకు స్వయంవర మహోత్సవము జరుగఁగలదు. ఇఁక నాలుగు దినములు చనినపిమ్మట నీ యూరువారు పెక్కండ్రందుఁ బోవుదురు. అంతదనుక మీరిం దుండుఁడు. అప్పుడు పోవచ్చునని చెప్పుటయు నే నట్లే యంగీకరించితిని. మమ్ముఁ జాల గౌరవము చేసిరి. పాతాళనుండి వచ్చిన రక్కసులు నా భార్యపైఁ గన్నువైచి యా యింటివానితో నట్లు చెప్పించిరని నేను గ్రహింపలేకపోయితిని. స్వర్గాది పుణ్యలోకములయం దాహార ముండదు. గాని రాక్షసలోకమందు భూలోకమందు వలెనే భోజనాదికములు సేయుచుందురు. మేము వారింట నాలుగు దినములు శిష్టకృతుగా భుజించితిమి.

ఆ పాతాళతలవాసులే పుణ్యవతీనగరంబునకుం బోవుచున్నవారము. మాతో రండి అని మమ్ముఁ బయనము సేసిరి. వారి కృత్రిమము దెలియక బండియెక్కియే వారివెంట బయలుదేరితిమి. నడుమ నడుమఁ బల్లెలయందు నివసించుటకుఁ దమ బంధువుల యిండ్లకే తీసికొనిపోవువారు. ఇంక రేపుమధ్యాహ్నమునకుఁ బుణ్యవతీ నగరముఁ జేరుదుమనఁగా నా రాత్రి నేను నిద్రించుచుండ నా భార్య నెత్తికొని వా రెక్కడికో పారిపోయిరి. తెల్లవారిలేచి చూచుకొంటిని. ప్రక్కలో బ్లేదు. నలుదిక్కులు పరికించితిని. ఎవ్వరు గనంబడలేదు. కర్దమా! కర్దమా! అని యా రాక్షసముఖునిఁ జీరితిని. ప్రతివాక్యము లేదు.

వారేమైరని మేము పండుకొని యున్న గృహయజమాను నడుగఁగా మా కేమియుఁ దెలియదు. వాఁరెవ్వరో మేమెఱుంగమని సమాధానముఁజెప్పెను. అప్పుడు నేను వారు గుజగుజలాడిన విషయము లన్నియు జ్ఞాపకము జేసికొని యా దుర్మార్గులే మోసముఁ జేసి యెత్తికొని పోయిరని నిశ్చయించి పశ్చాత్తాపముఁ జెందుచు నాహా? విశ్వనాథునకు నాయం దనుగ్రహము తప్పినట్లున్నది. నా బ్రాణబంధువురాలితో వియోగము గలుగఁజేసెనే? అయ్యో స్వర్గసుఖముల లెక్కింపక నా వెంటఁబడి యిడుమలు గుడుచుచున్న నా ప్రియురాలి వియోగము నే నెట్లు సహింతును? ఎందుఁ జొత్తును? ఏమి చేయుదును? ఎవ్వరితోఁ జెప్పికొందునని దుఃఖింపుచుండ నా యింటి యజమానుఁడు యెందుల కేడ్చెదవు? నీవు వోయి నిరృతిమహారాజుగారితోఁ జెప్పుకొనుము. వారు పాతాళరాక్షసులగు రక్కసులు కావచ్చును. ఇందలి వా రట్లుచేయరని