పుట:కాశీమజిలీకథలు -09.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరృతిలోకము కథ

153

నిచ్చి పొమ్మనెను. తత్ప్రభావమునం దేజోలోకమునఁ జేరితిని, అందీ తీర్థశుల్కం బత్నిగాఁ బడసితిని. మన కపిలయే తీర్థశుల్కగా నాకన్న ముందుగా వచ్చి యా లోకమునఁ బ్రవేశించినది. దీనిం గూడి మూఁడు దినము లింద్రభోగము లనుభవించితిని. మీవలె గంగలో మృతినొందినను బాగుండెడిది. ఇప్పు డింద్రునికి నాపై గోపము రాక మానదు. పారిపోవుచు దైవికముగా నీ లోకమునకు వచ్చి సీమారక్షకునివలన మీవృత్తాంతము విని యిందు నిలువంబడితినని జరిగిన వృత్తాంత మంతయు నెఱింగించి యిప్పు డింద్రునిబారి యెట్లు తప్పించుకొందునో యెఱిఁగింపుడని యడిగిన నతండు నాకిట్లనియె.

మోహనా! నీకు దైవసాన్నిధ్యము గలిగియున్నది. ఇంద్రు డేమియు నిన్నుఁ జేయలేడు. మేము పూర్వదేహము విడిచి స్వర్గంబునకు వచ్చితిమి. నీవా దేహముతోనే వచ్చితివి మాకంటె నీవే ధన్యుడవు. నీవాసించిన కార్య మెట్లయిన దీరినదిగదా? నక్షత్రలోకము లన నేమియో తెలిసినదిగదా? సంకల్పసిద్ధుఁడవు. నీ కేమియు భయములేదు. మఱియొక యుపాయ మెఱింగింతు వినుము. దేవతలకు రాక్షసులకు సహజవైరము. అయినను నిరృతి తపం బొనరించి దిక్పతిత్వము బొందెను. దానంజేసి యింద్రునకుఁ గ్రిందివాఁడైనను దనలోకము స్వతంత్రముగాఁ బాలించుకొనుచున్నాడు. అందు దేవేంద్రుని యధికారములేదు. అందున్న రాక్షసు లందఱు దేవతలవంటి వారఁట. సత్యాహింసావ్రతస్థులై యధ్యయనసంపన్నులై యొప్పుచుందురట. నిరృతియు బలి, ప్రహ్లాద విభీషణాదులఁ బోలినవాడు. దయాశాలి. మీరా లోకమునకుఁ బోయిన నింద్రుని శాసనమునకు వశము గానేరరు. కొన్ని దినము లందు వసించి యీ యపరాధము మాసినపిమ్మట నా నిరృతి నాశ్రయించి యింటికిం బోవుదురుగాక. ఇదియే నాకుఁ దోచిన యుపాయమని చెప్పినవిని నేను సంతసించుచు నమ్మహర్షికి మ్రొక్కి యనుజ్ఞ పుచ్చుకొని యా మిగిలిన పసరు పాదములకు రాచికొని యా చక్కెరబొమ్మ నక్కునఁ జిక్కబట్టి కన్నులు మూసికొని జయ విశ్వనాథా! యని ధ్యానించుచు నిరృతిలోకమునకు బోవలయునని తలంచితిని. అంతలోఁ దల్లోకసీమాంతరమును జేరి నిలువంబడితిని.

నిరృతిలోకముకథ

వయస్యా ! వినుము. నిరృతిలోకము స్వర్గలోకముకంటెఁ జిన్నదియే కాని యితర పుణ్యలోకముకంటెఁ జాల పెద్దది. మనోహరములైన క్రీడాశైలములు పుష్పవనములు, ఆరామములు పెక్కు గలిగియున్నవఁట. శోభకు స్వర్గముతో సమానమైనవనియే జెప్పవచ్చునఁట. అందున్న పొలిమేరకాపరి మాచెంత కరుదెంచి మీ రెవ్వ రనిన తమగురించి ముందటివలెనే చెప్పి యాతని మాయందిష్టముగలవానిగాఁ జేసికొంటిని. నే నడుగ నతం డాలోకవృత్తాంత మంతయు నిట్లు జెప్పెను.