పుట:కాశీమజిలీకథలు -09.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తిమి. ఇది యేలోకము? ఇందలి పుణ్యపురుషులు వచ్చి యెన్నిదినములైనది? ఏ సుకృతముఁ జేసిన నీలోకవాససౌఖ్యము లభించును? ఇందధికారిణి యెవ్వతె? ఇందుఁ బరిచారకులుగా గంధర్వు లెందఱు? కిన్నరు లెందఱు? కింపురుషు లెందరు? విద్యాధరు లెందఱు? విహారసౌధము లెన్నియున్నవి? ప్రధానదండనాథుని పేరేమి? అని యాగుట్టంతయు నెఱింగినవానివలె నడిగిన వాఁడు తల యూచుచు బాబూ? నీ వన్నియు నెఱింగినవాఁడ వౌదువు. వినుమిది తపోలోకము. ఇందుఁ దపశ్శుల్క యనుచిన్నది పుణ్యపురుషునకు మహిషీపదం బధిష్టించి యున్నది. మొన్ననే యొక యోగి కాశీపురోపకంఠంబున గంగలోఁబడి మృతినొంది దివ్యదేహము ధరించి ఈ లోకాధిపత్యము వహించి తపశ్శుల్కతో భోగము లనుభవించుచున్నాఁడు. అని చెప్పిన విని నేను మఱియు విస్మయము జెందుచు ఆహా! నాభాగ్యము వింతలపై వింతలు గనంబడుచున్నవి ప్రేయసీ! వింటివా? మనసిద్దవ్రతుఁడే యిందు వచ్చియున్నవాఁడట. ఎంతచిత్రము? అని యాశ్చర్యమందుచు వానితో నిట్లంటిని.

ఓయీ! నీవు నాకొక యుపకారము సేయవలయును ఇందున్న పుణ్యపురుషుఁడు నాకు గురువు. తత్పాదసేవలననే నేనిట్టిసుకృతము సంపాదించుకొంటిని. నారాక, ఆయనకుఁ జెప్పితివేని యొక్కమాటాడి పోయెదంగాక. ఈపాటి యుపకారము చేయమని ప్రార్ధించిన నాతడు గడియ నిలువుఁడు అతఁడే యీ పుష్పవనమునకు భార్యతో రాఁగలఁడు. అప్పుడు మాట్లాడుకొనియెదరుగాక అని సమాధానముఁ జెప్పుచుండఁగనే భేరీనినాదము వినంబడినది.

అదిగో మా ప్రభువు వచ్చుచున్నాఁడు. భేరీధ్వని మ్రోగుచున్నది. అందు నిలువుఁడు మాటాడి పోవుదురుగాక యని పలికి వాఁడు వారికిఁ గొంతదూర మెదురుగాఁ బోయెను. ఆ పుణ్యాత్ముఁడు తపశ్శుల్క చేయి పట్టుకొని సముచితపరివారముతో మేమున్న పుష్పవనమునకు వచ్చెను. అతండు రెండవ మహేంద్రుఁడువలె దివ్యాంబరాభరణాలంకృతుండై యొప్పుచుండెను. నేనెట్లు గురుతు పట్టుదును. సీమారక్షకు డతనికిఁ బూగుత్తులు గానుకగాఁ దీసికొనిపోయి యిచ్చి స్వామీ! మీ శిష్యుఁడట. జగన్మోహనుఁ డనువాఁడు భార్యతోవచ్చి మీదర్శనము నిమిత్తమందు వేచి యున్నాఁడు. తీస్వికొని రానా? అని చెప్పినంత ముప్పిరిగొను సంతోషముతో నతండు ఏఁడీ? యెందున్నవాఁడు? వేగము చూపుము. అని పలుకుచు వానివెంట నాకడకు వచ్చెను. నన్ను గురుతు పట్టెను.

ఓహోహో! ప్రాణబంధూ! జగన్మోహనా? నీ విక్కడికెట్లు వచ్చితివి? వెనుకటి రూపముతోనే యుంటివే? గంగలోఁబడి యేమైతివని యడిగిన నే నిట్లంటి. మహాత్మా! మీ యుపదేశబల మెట్టిదో చూడుఁడు. నేను గంగలోబడి మునిఁగి మీరు చెప్పిన సిద్ధుడున్న గూటిలోనికి కొట్టుకొనిపోయితిని. అతని పాదములే నా చేతికిఁ దగిలినవి. అతఁడే నన్నొడ్డున బారవైచి నా యభీష్టము దెలిసికొని పాదలేపనౌషధి