పుట:కాశీమజిలీకథలు -09.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేజోలోకము కథ

141

బ్రార్థించుచున్నవాఁడ. సంతతము నీటిలో జలస్తంభనఁ బట్టియున్న యతీశ్వరునిచరణపద్మములు ధ్యానించుచుండ నిట్టికల వచ్చినదని యనుకొనుచున్నాను. నాకు మతిపోయినది. నేనిప్పు డేయవస్థలో నుంటినో తెలియదు. మిమ్ముఁ బార్ధించుటఁ గూడ స్వప్న మేమో యని తలంతును. స్వప్నములోగూఁడ మీయట్టి తపస్వులు గనంబడుట శ్రేయస్కరమేకదా? అని ప్రార్ధించిన నాయోగిసత్తముండు మందహాసచంద్రికలు నాపై వ్యాపింపజేయుచు నిట్లనియె.

ఓరీ! ప్రపంచకమే స్వప్నమువంటిది. సంసారమే యింద్రజాలము వంటిది అందొక్కటియు సత్యమైనది లేదు. అంతయు భ్రాంతియే. నిజమువలెఁ దోచుచుఁ దెలిసికొన నబద్ధమగుచుండును. కానిమ్ము. నీవంత్యకాలమ్మున విశ్వనాథునితోఁ గూడ నాసిద్ధుని ధ్యానించితివి కావున నీకామితమ్ము నెరవేర్పక తప్పదు. నా వెంట రమ్ము అని పలికి యతం డవ్వల నడుచుచుండెను. అప్పుడు నేనోహో! నా పురాకృతసుకృతము ఫలించినది. ఆడఁబోయిన తీర్థ మెదురువచ్చినది. వెదుకఁబోయిన మందు గాలికే తగులుకొనినది. సిద్ధవ్రతుం డెఱింగించిన సిద్ధుం డితండే కావచ్చును. తనచరణములు పట్టిన నన్ను గట్టునఁ బారవైచిన యోగి యితఁడే కావచ్చును. ఆహా! ఏమి నాభాగ్యము? ఏమి నా సుకృతము? కరుణాసనాథుండగు విశ్వనాథుని యనుగ్రహము నాపై వ్రాలినది. కాకున్న నిట్టి యుత్కృష్టుని దర్శన మగునా? సిద్ధవ్రతుని యుపదేశము నేఁటికి సఫలమైనది. ఆ మహాత్ముండును స్త్రీలును నావలెనే యున్నతస్థితి వహింతురుగాక అని తలంచుచు నా యోగివెంటఁ బోయితిని.

ఆసిద్ధుం డెవ్వరివంకఁ జూడక యెవ్వరితో మాటాడక తిన్నగా కాశీపురంబు దాటి యీశాన్యమున క్రోశదూరములోనున్న యొక పాడుపడిన పర్ణశాలకుం బోయెను. నేను వారివెంటఁబడి పోయితిని. నాతో మఱేమియు మాటాడలేదు. అందెందో దాచి యుంచిన యొక చిన్నబరిణదెచ్చి నాకిచ్చి యిది యొక సిద్ధౌషధము. దీనిం బాదములకుం బూసికొని తలంచిన చోటికిఁ బోవచ్చును. ఇది మూఁడుసారులకే యుపయోగించును. నీయిష్టమువచ్చినచోటికిఁ బొమ్ము. పొమ్ము. అని పలికి యాసిద్ధుండు. లోపలికిఁ బోయి మఱల నాకుఁ గనంబడలేదు.

అప్పుడు నేను బెన్నిధింగన్న పేదయుంబోలె మిక్కిలి సంతసించుచు నాబరిణ గట్టిగా మూసిఁగట్టికొని వెండియు గంగాతీరంబున కరుదెంచి భక్తిపురస్పరముగా భాగీరథిం గృతావగాహుండనై విశ్వనాథు నభిషేకాద్యుపచారముల నర్పించి కన్నులు మూసికొని చేతులు జోడించి యిట్లు ధ్యానించితిని.

ఉ. ఓపరమేశ! యోవరద ! యోకరుణాకర ! విశ్వనాథ ! నే
    నీపదపద్మముల్ మదిని నిల్పుటఁజేసి వితత్ప్రభూతసం
    తాపము వాసి దివ్యభువనస్థితివైభవము ల్గనుంగొనం
    బ్రాపు లభింపఁగంటి నిటుపై నెటు జేసెదొ నీదు భక్తునిన్.