పుట:కాశీమజిలీకథలు -09.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కడు విచిత్రములుగదా! ఏ పనికిఁ దనకు స్వతంత్రము లేకున్నను నన్నియుఁ దనవలెనే జరుగుచున్నట్లు తోచును.

కొంతదూరము నీటిలో మునిఁగి నేను గొట్టికొని పోవునప్పటి కొకచోట నా యొడ్డునఁ గూడు గనంబడినది. బ్రతుకుజీవుఁడా! యని యా గూటిలోనికిఁ గొంచెము డేకి దడిమితిని. మెత్తగా నా చేతులకేదియో దగిలినది. దానిం గట్టిగా బట్టికొని విమర్శించితిని. మనుష్యుని పాదమువలె తోచినవి. నేను విడువక చేఁతులతోఁ బట్టుకొని నా శిరంబు వానికిఁ దగిలించి రక్షింపుమని సూచనఁ జేసితిని అందొక యోగి జలస్థంభనఁ బట్టి తపము జేసికొనుచు నప్పుడే బాహ్యప్రచారము గలిగి బైటకుఁ బోవలయునని తలంచుకొనుచుండెను. నా శిరంబు తన చరణంబులు సోకినంత కరంబున నాచి బట్టుకొనెయె నంతపట్టు జ్ఞాపకమున్నది.

అంతలోఁ గన్నులం దెరచిచూడ నేనాతీరంబునం బండుకొని యుంటిని. తటాలున లేచి తడిగుడ్డలఁ బిండికొనుచు నలుమూలలు పరికించితిని. ఒకప్రక్క వ్యాఘ్రచర్మోత్తరీయుండు జరామరుఁడు విరాజితుండగు నొక మహాయోగి నాకుఁ గన్నులపండువ గావించెను. గంగలో మునింగి కొట్టుకొనిపోవుచు నేనెట్లు గట్టునం బడితినో తెలియదు. గూటిలోనున్న మహాత్మునివలననే యా యాపద దాటినదని నిశ్చయించితిని. కాని నా మనస్సు వికారము నొందియుండుటచే జరిగినదంతయు స్వప్నమని భ్రాంతిపడుచుంటిని. గూటిలోనున్న యోగి యీవలకు వచ్చెనని తలంతమన్నను జటాజినవల్కలాదులు తడసినట్లు కాన్పింపవు. ఏది యెట్లయినను సరేయని యాయోగి పైకిఁబోవుటకు రెండడుగులు వైచినంతనే నా తడిగుడ్డలతోనే యడ్డమువోయి పాదంబులంబడి మహాత్మా? రక్షింపుము. రక్షింపుము నేనిప్పుడు మోహాంధుండనై యేమియుం దెలియక భ్రాంతుండనైతిని. నాకిది స్వప్నమో, యింద్రజాలమో, దైవమాయయో, తెలియకున్నది. నా వృత్తాంతము గొంచెము విని నా భ్రాంతి బోఁగొట్టుఁడు. మీయట్టి మహానుభావుల ప్రాపునంగాక నాయట్టి నికృష్టుల కష్టములు దీరునా? నేనొక రాజకుమారుండ, నాపేరు మోహనుఁ డందరు. నాకు మా గురు ఖగోళవిషయం బెఱింగించునప్పుడు నక్షత్రమువలన నేమియో తెలిసికొనవలయునని యభిలాష గలిగినది. అది మొదలు సన్యాసుల నర్చించుచుంటిని. కొన్నిదినములకు సిద్ధవ్రతుండను బైరాగి ప్రాపు దొరకినది. అతండు కాశీపురంబున గంగలో జలస్తంభనఁ బట్టి తపముఁ జేసికొనుచున్న యోగివలనంగాక నీకామితము మఱియొకనివలనఁ గాదని యుపదేశించెను. ఆమాట నమ్మి రాజ్యభోగముల విడిచి యతనివెంటఁ బడితిని. దారిలో నిద్దరు స్త్రీలు నామూలమున యోగినులై మావెంటఁ బడిరి. అందరము నిన్న గంగదాటుచుండ నోడ మునుంగ గంగలోఁబడితిమి. నాకొక గూటిలోనున్న మహాత్ముని చరణసేవ దొరికినది. ఈగట్టుపైఁ జేరితిని. మహాత్మా! ఇది యంతయు స్వప్నమో దీనిలోఁ గొంత స్వప్నమో తెలియకున్నది. ఇదెంత నిజమో యెంత యసత్యమో వివరం బెఱింగింపఁ