పుట:కాశీమజిలీకథలు -09.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18]

దేవకన్యకల కథ

137

శ్రీవిశ్వేశ్వరమహాదేవుని దర్శించుటకు దేవతలుగూడ వత్తురని వాడుక యున్నది.వీరట్లే వచ్చిన వారగుదురు. కానిమ్ము. వీరి చక్కదనము మరియొకసారి చూచి నేత్రానందముఁ గావించి కొనియెదనని తలంచి యా బండివాని వెంటఁ గొంతదూరము పోయి సానునయముగా నిట్లనియె.

ఓరీ? ఈకాంత లెవ్వరు? ఎందుండి వచ్చిరో యెఱుంగుదువా? అని యడిగిన వాఁడు స్వామీ! వీరెవ్వరో నేనెరుఁగ నిన్నటి సాయంకాలమే నాబండి కుదిర్చికొనిరి. ఈ యిద్దరికి నాయన భర్త కాఁబోలు. ఆయనయు మంచి సొగసుకాఁడు. సాయంకాలము తిరుగా విశ్వనాథు నాలయమున కేగుదురఁట. మూఁడుగంటలకు బండి తీసికొని రమ్మనిరని చెప్పి వాఁడవ్వలకుఁబోయెను.

సిద్దార్థుఁ డామాటలు విని కానిమ్ము. సాయంకాలము వారు తిరుగా దేవళమునకుఁ బోవుదురుగదా ! అప్పు దవకాశ మరసి పరిశీలించెదంగాక యని తలంచి యావేళకు వచ్చి యాయింటి ప్రక్కఁ గూర్చుండెను.

ఆవార్త యెట్లు తెలిసికొనిరో పౌరులు గుంపులుగా వచ్చి నాలుగుగంటలవేళకావీథిని మూఁగికొనిరి. బండివాఁడు మఱియొక పెట్టిబండి తీసికొని వచ్చెను. ఇద్దరి స్త్రీలతో నొకపురుషుఁ డాబండిలో నెక్కెను. చోదకుఁడు విశ్వేశ్వరుని యాలయము దెసకు బండిని తోలుచుండెను. జనులు తోసికొని బండి వెంబడి నడుచుచుండిరి. బండిదాపునకుఁ బోవుటచే యవకాశము గలిగినది గాదు. అప్పుడు సిద్దార్థుఁ డాలోచించి,

సీ. ఇంద్రమిత్రుఁడు నామహీమహేంద్రుని పుత్రు
              మిత్రుఁడఁ దన్మంత్రి పుత్రకుండ
    సిద్ధార్థుఁడనువాడఁ జెలికాఁడు మోహనుం
              డనువాఁడు కాశికాయాత్ర వచ్చి
    గంగ దాటుచుఁ బెనుగాలి యోడ మునుంగ
             మునిఁగి తానం నాకమునకుఁ బోయె
    విహితులతో వానివెదకుచు నిటవచ్చి
             యవ్వార్త విని మృతినందలేక
గీ. మొండినై యిమ్మహాపురంబునఁ జరింతు
    నేమియును గామితము లేదదేమొ కాని
    మిమ్ముఁ జూడఁగ నాకభీష్టమ్ము గలిగె
    దర్శన మొసంగు డొకసారి ధన్యుఁడగుదు

క. నన్నిట సౌహార్దముతో
   మన్నించి ప్రియంబుమీర మాటాడ హితుం
   గన్నట్లు సంతసింతుఁగ
   దన్నా! నీమీఁద వ్రాలె నన్సద్వాంఛల్.

అని పత్రికలో వ్రాసి యాపత్రిక మడచి శకట గవాక్ష వివరమునుండి