పుట:కాశీమజిలీకథలు -09.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అప్పు డతండు తనస్నేహితుఁడు సాగరము పాలయ్యెనని వగచుచుఁ దానింటికి బోలేక యా విషయములన్నియు నింద్రమిత్రునకుఁ బత్రిక వ్రాసి యంపెను. మఱియు నున్మత్తుఁడువలె నాయూరఁ దిరుగుచుండెను.

ఒకనాఁడు సిద్ధార్థుండు తనకు నింటికడ మోహనుఁడు జెప్పినమాట జ్ఞాపకము వచ్చుటయుఁ దిన్నఁగా విశ్వేశ్వరుని యాలయంబునకుం జని యందలి కుడ్యభాగంబులన్నియు విమర్శించి చూడ నొకభైరవవిగ్రహముక్రింద నీక్రింది పద్యము వ్రాయఁబడి యున్నది.

క. ఓపికతోఁ బూనిన పని
   యాపదలైనం బొనర్చుటది యుచితంబా
   యాపదలె మేలు సేయు మ
   హోపకృతుల్గాఁ దనర్చు నొక్కొక వేళన్.

ఆ పద్యము మోహనుఁడు వ్రాసినదిగాఁ దెలిసికొని సిద్ధార్థుండు దాని భావము వితర్కింపుచు, వీఁడీ పద్యము నెప్పుడు వ్రాసియుండును ? తాను గొప్ప యాపదపాలైనట్లు నదియె తన కుపకారముఁ జేసినదనియు సూచించుచు నీ పద్యము వ్రాసినాఁడు. ఓడలో మునింగినవారు తీరముఁ జేరలేదని చెప్పుచున్నారు. ఈనగరము జేరకుండ నీపద్యము నెట్లు వ్రాయఁగలఁడు? ఇది మిక్కిలి చోద్యముగా నున్నది. ఈ లిపి వానిదగుట నిక్కువము. దీనిం బట్టిచూడ వాఁడు జీవించియున్నట్లు కనంబడుచున్నది. అని పెక్కుతెఱంగుల విమర్శించుచు గొన్నిదినము లాకాశీపురంబున వసించి యతనిజాడ నఱయుచుండెను.

దేవకన్యకలకథ

ఒకనాఁడు సిద్ధార్థుడు కాశీపురవీథులం దిరుగుచుండ నొక బండివెంట జనులు గుంపులుగా మూఁగిపోవుచు దేవకన్యకలు దేవకన్యకలని యఱచుచుండిరి. ఆ కేకలు విని సిద్ధార్థుఁడు గూడ నా గుంపులోఁజేరి యానారీమణులఁ జూడదొడంగెను. ఒకబండిలో నిరువురు తరుణులు గూర్చుండి తెరవైచికొని పోవుచుండిరి. ఆ తెర సందులనుండి యా తెరవల వింతగాఁ జూచుచుండిరి.

ఆ ముద్దుగుమ్మలు ప్రొద్దున్న గంగాస్నానముజేసి విశ్వేశ్వరుని దర్శించి బసలోనికిం బోవుచున్నారు. స్నానము చేయునప్పుడు వారిం జూచినవారు దేవకన్యలని పేరుపెట్టిరి. ఆ మాటలే పలుకుచు జనులు వారి బండి వెంటఁ బోవుచుండిరి. బండిలో నున్నప్పుడు వారిరూపము లంతగాఁ దెల్లము కాకున్నవి. వీరు విదేశ రాజపుత్రికలు చక్కనివారగుట దేవకన్య లనుచున్నారని తలంచియు మానక యా బండివెంటఁబోయి వారు బండి దిగి బసలోనికిఁ బోవుసమయంబున మెరపుతీఁగెవలె దళుక్కుమని మెరసిన వారిసోయగముఁ జూచి ఆహా! వీరు నిజముగా దేవకాంతలవలె నున్నారు.