పుట:కాశీమజిలీకథలు -09.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యజ్ఞదత్తుని కథ

135

కూలంకషంబుగాఁ బొంగి ప్రవహించుచున్నది. మా గురువు కాశీపురప్రభావము వర్ణింపుచుండ నాలించుచు నోడ రాక వేచియుంటిమి.

అంతలో నాకు దేహబాధకుఁ బోవలసిన యవసరము గలుగుటయు వారికిఁ జెప్పకయే నేనవ్వలికిఁ బోయితిని. నేను మఱల వచ్చునప్పటికి వారోడ నెక్కి యవ్వలికిఁబోవుచున్నట్లు కనంబడినది. అంతలోఁ బెద్దగాలివాన వచ్చుటచే నాకందు నిలువ వీలుగలిగినదికాదు. దాపున నున్న పల్లెకుఁ బోయి నాఁడు గడిపితిని. అందున్న పల్లెవాండ్రు రాత్రి రేవుపడవ గాలి విసరున గంగలో మునిఁగినదనియు నందలి జనులందరు గంగలోఁబడి మృతినొందిరనియు జెప్పికొనఁదొడంగిరి. ఆవార్త విని నేను మిక్కిలి పరితపించుచు మఱునాఁ డుదయంబున గంగయొడ్డునకుఁబోయితిని. నేవిన్న వార్తయే రూఢియైనది. నాఁడు మఱియొక యోడవచ్చినది. అందెక్కిన నావికుల నడిగితిని. వాండ్రు సామీ ? ఇట్టి యుపద్రవ మెన్నఁడును జరుగలేదు. తీరము రెండ బారలలో నున్నది. తెరచాపదించుట కవకాశము గలుగలేదు. ఓడ తలక్రిందులయినది. పాపము బాటసారులు స్త్రీలు పురుషులు వృద్ధులు బాలురు చాలమంది గలరు. అందరు మృతినొందిరి. కాశీరాజుగారు వారి శవములఁ బట్టించి చిత్తరువు చెక్కించి దహనాదిసంస్కారములు గావింపజేసిరి. నావికులుగూడ సమసిరని యా వృత్తాంతమంతయు నెఱింగించిరి.

ఆయుశ్శేషముండఁ బట్టి నేను నిన్న నోడ యెక్కలేదని తలంచి వారికొఱకుఁ జింతించుచుఁ జేయునది యేమియును లేక యీవ్యాసమఠంబునకు వచ్చి కాలక్షేపముఁ జేయుచుంటి. నాఁకిక నట్టి గురుండు దొరకఁడు. పాపము రాజపుత్రుఁ డింటికడ సుఖంబుండక వెర్రితలంపు పెట్టికొని వచ్చి దిక్కుమాలిన శవమై యిందు లాగఁ బడెను. భీమవర్మ కూఁతురు చంద్రిక సర్వభోగముల వీడి నీమిత్రుని వరించి వెంటఁబడి వచ్చినది. అందరికి నిక్కడ మరణము వ్రాసియుండ నెట్లు తప్పును? అని యావృత్తాంతమంతయు నెఱింగించెను.

అయ్యుదంతము విని సిద్ధార్థుండు దుఃఖించుచు నప్పుడు కాశీరాజు కొల్వునకుం బోయి తన కులశీలనామంబులు సెప్పి నాఁడు గంగలో మృతినొందిన వారి చిత్రఫలకములఁ జూపుఁడని యడుగుటయు వానిఁ గనుపరుచుమని యొక యుద్యోగస్థున నాజ్ఞాపించెను. ఆ యుద్యోగి వారినెల్ల సిద్ధార్థునకుఁ జూపెను. సిద్ధవ్రతుఁడు, చంద్రిక, కపిల, వీరి చిత్రఫలకముల గురుతుపట్టి విమర్శించి చూచెను. కపిలాచంద్రికలఁ దానెఱుఁగకున్నను యోగశిష్యుండు చెప్పిన గురుతులంబట్టి వారే యని గ్రహించెను. మఱియు బాటసారుల చిత్రఫలకములు చాల నున్నవి, మోహనుని చిత్రఫలకమందుఁ గనంబడలేదు.

నాఁడు పడవలో మునింగిన వారందరు దొరకిరా అని యడిగిన నాయుద్యోగి జాలమంది దొరికిరి. దొరకనివారు సముద్రముపాలై యుందురని చెప్పెను.