పుట:కాశీమజిలీకథలు -09.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

గీ. తిరిగెఁ బలుమారు గుడిచుట్టు వెఱచియైన
    జచ్చెఁ గాశీపురంబున శర్వుమ్రోల
    సూక్ష్మదృష్టి విచారించి చూడ నింత
    కన్న నుత్తమమగు పుణ్యకర్మమేది?

చౌర్యమునకైనను నీఁడు నిత్యము గంగాస్నానంబు చేయుచుండు. వీని పాపంబులు పటాపంచలు గాక నలిచియున్నవా? సామాన్యులకు మహాశివరాత్రి దివసంబునఁ గాశీపురంబున మరణంబు లభించునా? కాశీప్రభావం బెఱుంగక మీరిట్లు వచ్చితిరి. తెలిసికొను డిదిమొద లెన్నఁడును బంచక్రోశమధ్యంబున మృత్యు డగువాఁడెట్టివాఁడైన వానికొఱకు మీరు రాకుఁడు. కాలభైరవునికిఁ దెలిసిన మిమ్మీపాటికే గెంటివైచు పో, పొండు. శివధర్మ మతిగూఢమని పలుకుచు శివకింకరులు యజ్ఞదత్తు నుత్తమలోకంబునకుఁ దీసికొనిపోయిరి. వింటిరా. కాశీపురప్రభావంబని సిద్ధవ్రతుఁడు చెప్పుచుండఁగనే యోడ రేవు చేరినది. అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది.

192 వ మజిలీ

మోహనుని మరణవార్త కథ

మఱికొన్నిదివసంబులక్రింద మిత్రుండు పుత్రుండు సన్యాసులవెంట దేశాంతర మరిగెనని తెలిసికొని పరితపించుచు వానిని వెదకుటకై ప్రయాణోన్ముఖుండగుటయు వారించుచు సిద్ధార్థుం డారహస్యముం దెలియనీయక తాను బోయి వెదకి తీసికొని వచ్చెదనని చెప్పి తురఁగారూఢుండై బయలుదేరి యుత్తరాభిముఖముగాఁబోయి జాడలు దీసికొని వారు వోయిన తెఱవునుబట్టి కొన్నాళ్ళకుఁ గాశీపురంబున కరిగెను. అందు వ్యాసమఠంబున నున్న యోగులనెల్ల విమర్శింప సిద్ధవ్రతునితో వచ్చిన శిష్యుఁ డొకండు గనంబడియెను.

వానిం గురుతుపట్టి పల్కరించి తనపేరు సెప్పి మీగురుండెం దున్నఁవాడని యడుగుటయు నతండు కన్నీరు నించుచు వారందరు పురందరపుర మలంకరించిరని దద్గదస్వరముతోఁ దెలియపరిచెను.

ఆ! ఏమీ! ఏమి! అని సిద్ధార్థుఁడు శోకవేగంబున నొక్కింత తడ వొడ లెఱుంగక యెట్టకేఁ దెప్పిరిల్లి యుల్లము పగుల దుఃఖించుచు వారెట్లు చచ్చిరో తెలుపుమని యడిగి నాయోగి శిష్యుం డిట్లనియె.

అయ్యా ! మేము మీనగరము విడిచి యుత్తరాభిముఖులమయి పోయి పోయి యనేక జనపదంబులం గడచి కొన్నినెలలకు గంగాతటంబుఁ జేరితిమి. దారిలోఁ గపిలయుఁ జంద్రికయు నను నిరువురు తరుణులు మా గురువునకు శిష్యురాండ్రై వెంటఁబడి వచ్చిరి. మేమోడకై రేవుకాచికొని యుంటిమి. అప్పుడు గంగానది