పుట:కాశీమజిలీకథలు -09.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యజ్ఞదత్తుని కథ

133

దర్శనలాలసుండువోలె నా ప్రాంతమున వసించి శైవుడుగావించు శివపూజ జూచుచు నమస్కారముఁ గావించుచు నతండెప్పుడు నిద్రించునో యని యవకాశ మరయుచు నిద్రబోవక కాచియుండ నాలుగవ జామున శైవుడు నిద్రకు దాళలేక కునికిపాట్లు పడజొచ్చెను.

అప్పు డతఁడు మెల్లన గుడిలోనికిం బోయి సన్నగిల్లుచున్న దీపము నెగద్రోసి యవ్వెలుంగున మృష్టాన్నము లుపలక్షించి భక్ష్యములతోడి యన్నపాత్ర మెత్తి మెల్లగా నవ్వలకుఁబోవు సమయంబున దైవవశంబున వానిపాద మాశైవునికి దగిలినది అతండులికిపడి కన్నులం దెరచి వానిం జూచి దొంగ దొంగ యని యరచెను. అయ్యరపులు విని చేరువనున్న తలారులు అన్నపాత్రము విడువక పారిపోవుచున్న యజ్ఞదత్తుం దరిమికొని పోయిరి అతండాయాలయము చుట్టును పదిమారు దిరుగుచు వారికి దొరకడయ్యెను.

అప్పుడు వాండ్రు కోపించి యూచల నేసి వానిం గడతేర్చిరి. భయంకరాకారముతో యమకింకరు లరుదెంచి వాని బాశంబులంగట్టి యమలోకమున కీడ్చికొని పోవుచుండిరి. అంతలో మనోహరాకారములతో శివకింకరు లరుదెంచి యమకింకరుల నదలించుచు వాని కట్టుల విప్పించి దివ్యమాల్యాంబరాభరణాలంకృతుం గావించి విమానముపై గూర్చుండబెట్టి శివలోకంబున కరుగనున్న సమయంబున యమకింకరులు చేతులు జోడించి యిట్లనిరి.

చ. ఓమహితాత్ములార! యిపు డుర్వి నధర్మము ధర్మమయ్యె నా
    సేమములన్ ఘటింపఁగ వచింపుఁడు సమస్తకిల్బిష
    స్తోమగతక్రియాచరణదుష్టచరిత్రకుఁ డిట్టివాని మీ
    రేమి గుణంబు జూచి పొనరించితి కార్యవిమానసంస్థుగా.

వీడు కులాచారవిహీనుండు. పితృవాక్యపరాఙ్ముఖుండు. మిత్రద్రోహుడు. కులభ్రష్టుడు విప్రసర్వసహర్త. శివద్రవ్యాపహారియై మరణించె. పుణ్యము లేశమైన వీనియందు గనంబడదు. వీనినెట్లు విమాన మెక్కించితిరో చెప్పుడని యడిగిన నవ్వుచు శివకింకరు లిట్లనిరి.

సీ. తిండి యేమి లభింపకుండిన నైనను
             శివరాత్రి నుపవాససిద్ధి గాంచె
    నన్నంబు నందలి యాసక్తినైనను
             సలిపె నప్పటిదాక జాగరంబు
    వస్తువుల్ జూచు తాత్పర్యంబునను నైన
            నెగద్రోసె దీపంబు సిగవెలుంగ
    నిచ్చలేకున్న దా నీక్షించె నితరు లీ
           శ్వర మౌళిజేయు పుష్పముల పూజ