పుట:కాశీమజిలీకథలు -09.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

పట్టఁజిట్టకంబులు వెలయించుచు నెట్లో దానిం గలిసికొని వెలిచవుల నభిరుచి పుట్టించి యిల్లు కదిలించి దేశాంతరమునకు దీసికొనిపోయెను.

వాఁ డట్లు కులభ్రష్టుండై కాపుకూఁతురుతో గాపురముజేయుచు నొక మాలపల్లె యందు గొన్ని దినంబులుండి జీవనము జరుగనందున నా పల్లె విడిచి మఱియొక పట్టణముజేరి యందుఁ గల కబరులతోఁ గూడికొని చౌర్యక్రియారతుండై దారులు గొట్టుచు గొన్నిదినంబులందు గాలక్షేపముజేసి మ్రుచ్చులతో బోట్లాడి యందుండక మఱియొక గ్రామము చేరి యందు గొన్ని దినములు నివసించెను.

యీ రీతి దేశములన్నియుఁ దిరిగితిరిగి పూర్వభవసుకృతవిశేషంబునం జేసి తుదకీ కాశీపురంబుజేరి యిందును -

సీ. గంగలో మున్గి మున్గంగ వచ్చిన తైర్ధి
             కుల పాదషణంబులు హరించు
    విశ్వేశు గుడిమ్రోల వెలయుగుంపున దూరి
             కంప భూషణములఁ గత్తిరించు
    నంగళ్ళఁ దిరిగి యొయ్యనపరాకు గనుండు
            వారిమూటలనెత్తి పారిపోవు
    తీర్థవాసుల పనుల్‌దీర్చి పెత్తనగా
            దొరికిన వస్తువుల్ దొంగిలించుఁ
గీ. గ్రొత్తతైర్థికులకు నిళ్ళు గురుతుఁజూపి
    భద్రమనిపల్కి రాతిరి పడినయంత
    దోచికొని పోవు వారివస్తువులనెల్ల
    యజ్ఞదత్తుడు చౌర్యక్రియానురక్తి

ఇట్లు కైవల్యలక్ష్మిఘంటాపథంబయిన కాశీపురంబు జేరియు వాఁడు సన్మార్గ ప్రవర్తనుడుగాక తస్కరుండై తిరుగుచు నొక్క మహాశివరాత్రినాడు వేకువజామున లేచి గంగలో మునిఁగి తీర్థవాసుల పాదభూషణముల హరింప దలంచియు రక్షకపురుషుల కాపుదలం జేసి తత్ప్రయత్నంబు కొనసాగినదికాదు. అందుండి లేచివచ్చి సాయంకాలముదనుక విశ్వేశ్వరుని యాలయము చుట్టును దైర్థికులంవెంట దైర్థికుండు వోలె దిరిగియు నేమియుం దొరకమింజేసి పరితపించుచు శుష్కోష వాసమున బేర్చు కార్చిచ్చువలెఁ గడుపున పేరాకలి బాధింప బోజనంబెక్కడ దొరకునో యని యాలోచించుచు దిరిగి దిరిగి యొక్క శివలింగంబు ప్రక్కశైవుండొకండు శివపూజ జేయుచు రాత్రి నాలుగుజాములు నమ్మహాలింగమునకు బూజానైవేద్యములు సేయదలంచి చతిర్వాధాన్నంబులు గొనివచ్చి యందుంచి క్రమంబున నయ్యోగిరములు స్వామికి నైవేద్యము సేయుచుండెను.

అవ్విధం బంతయు యజ్ఞదత్తుండు సూచి యువ్విళ్ళూరుచు శివపూజా