పుట:కాశీమజిలీకథలు -09.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

లోపలకుఁ ద్రోసెను. పదినిమిషములలో నాబండిలో నున్న పురుషుఁడు బండి యాపించి తలుపు తెరచి యుత్తమాంగ మీవలఁబెట్టి సిద్ధార్థుండనువాఁ డెక్కడ? ఇటు రావలయునని కేక పెట్టెను. ఆ ప్రాంతమందే యున్న సిద్ధార్థుఁడు దాపునకుఁబోయి నేనే సిద్ధార్థుఁడనని పలుకుటయు లోపలికి రండు, రండు అని పిలుచుచుఁ జేయిపట్టుకొని యెక్కించి తలుపువైచి తనప్రక్కఁ గూర్చుండఁ బెట్టుకొనియెను. ఎదురు బల్లపైఁ దన కభిముఖముగాఁ గూర్చుండియున్న యాయన్ను మిన్నల నిర్వురం జూచి విభ్రాంతిఁ జెందుచు నేమనుటకును నోరు రాక యోహో! యీత డెవ్వఁడో చాల మంచివాఁడు. సంశయింపక యిట్లు నన్నుఁ దన యాఁడువాండ్ర యెదురఁ గూర్చుండఁ బెట్టెనే? కన్నెత్తి వీరి సౌందర్యము చూతమన్న బాగుండదు. అని తలంచుచు సిద్ధార్థుం డోరచూపుల నతని మొగముపై వెలయింపజేసెను అతండేమియు మాటాడ లేదు. ఆ పొన్నకొమ్మలు మేనం జెమ్మటలు గ్రమ్మ నేమనుటకుఁ దోచక తొట్రుపడుచున్న సిద్ధార్థుని నగమొగముతోఁ జూచుచుండిరి.

అప్పు డెట్టకే నెలుంగు దెచ్చుకొని మహాపురుషా! నీవు నాప్రాణమిత్రుండు జగన్మోహనునివలె నుంటివి. మందాకినీగర్భమరణసుకృతంబునం జేసి నాకంబునకేగి యందు దేవతాకన్యకలఁ బరిగ్రహించి వారితోఁగూడ నీపుణ్యభూమి చూడవచ్చినవాఁడవని యుత్ప్రేక్షింపవచ్చును. ఈ పూవుఁబోండ్లు మనుష్యస్త్రీలు కారని తెల్లమగుచున్నది. దానంజేసి నీవు కంతుజయంతవసంతాదులలో నొక్కండవు కావలెను. మిమ్ముఁజూచుట చేతనే నేను కృతకృత్యుండనైతిని. మిత్రవియోగసంతాపం బంతరించినది. మీయుదంత మెఱింగించి శ్రోత్రానంద మాపాదింపుఁడని ప్రార్థించెను. ఆ పురుషుండేమియు మాటాడక యూరక చూచుచుండెను. అప్పు డందొక యొప్పులకుప్ప చిరునగవుతో మనోహరా! వీరేదియో యడుగుచుండ మాటాడరేమి? వారి యభిలాష తీర్పుఁడని పలికినది. అప్పుడాపురుషుండు మోమువికసింపఁ జెప్పుట కేమున్నదిఁ తాననుకొనిన యుత్ప్రేక్ష స్వభావోక్తి యని తలంపవచ్చునని మెల్లఁగఁ బలుకుటయు నతండు స్వరము గ్రహించి ఆ! ఆ! ఏమీ! ఆ! ఆ! నాప్రాణమిత్రుఁడు మోహనుఁడే? మోహనుఁడే? అని పలుకుచు సంతోషము పట్టజాలక వివశుండై కన్నులు మూతఁబడ వెనుకకుఁ జేరఁబడియెను.

అప్పు డాపురుషుఁడు వాని నానిపట్టుకొని యుత్తరీయము చెలుఁగున విసరుచు సిద్ధార్థా! అని పిలుచుచు సేద తీర్చెను. సంతోషము దుఃఖము గూడ నెక్కువగాఁ గలిగినప్పుడు వివశత్వము వహించి యొక్కొక్కప్పుడు ప్రాణములు గూడ వదలుచుందురు. ఆ పురుషుం డతండు పలుకుపలుకు తొంతరపడి పిలుచుచు దాను విసరుచు భార్యలచేత విసరించుచుండ గొండొకసేపున కతండు కన్నులం దెరచెను.

వయస్యా! లెమ్ము. లెమ్ము. నేను నీప్రియమిత్రుఁడ జగన్మోహనుఁడ. నీవనినట్లు నాకమున కేగియే వచ్చితిని. నా యభీష్టము తీరినది. లెమ్మని పలికినంత