పుట:కాశీమజిలీకథలు -09.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

యజ్ఞదత్తుం డాటపాటల మరగి చదువక క్రమంబున ద్యూతక్రీడారతుండై కితవులఁగూడి తిరుగుచుండును. మఱియు

సీ. బ్రాహ్మణాచారము ల్పరిహిస మొనరించు
              నగ్నిహోత్ర విధానమన్న నవ్వు
    సంధ్యాభివందనార్చనలు హేళనసేయు
              వేదార్థవేత్తల వెక్కిరించు
    పాషండ షండ దుర్భాషల నుతియించు
             గీత వాద్య వినోదకేళి మెచ్చు
    ధాతువాదులనె యుత్తములని కొనియాడు
            ద్యూతకారులను నార్యులని పొగడు
గీ. నటుల మన్నించు వర్ణించు నాస్తికులను
    పీఠమర్దుల నగ్గించి పెద్దఁజేయు
    విటులఁ గైవార మొనరించు వివిధగతుల
    దీక్షితునిపట్టి చెడుగుల తెఱవుబట్టి.

అగ్నివర్మయు నితరవ్యాసంగసక్తుఁడగుటఁ గుమారునిదుశ్చేష్టితముల నేమియుఁ బరిశీలింపక యప్పుడప్పుడు భార్య నడుగుచుండ నామెయుఁ బుత్రునందలి ప్రేమచే వాని దుర్వ్యాపారము లన్నియు గప్పిపుచ్చి చదువుచున్నాఁడనియు వ్రేల్పుచున్నాఁడనియు వార్చుచుచున్నాఁడనియు బొంకుటయేగాక సజీవనిర్జీవద్యూతంబుల వా డోడిన సొమ్మునకై జూదరులకు దనమేనియాభరణము లిచ్చి సరిపెట్టుంచుండునది. మఱియు నెడప దడప భోజనమునకు వచ్చినప్పు డామె దుర్వ్యాపారములు విడువుమని పెద్దగాఁ బుత్రునకు బోధించును. అందులకు వాఁడేమియుఁ బ్రత్యుత్తర మీయక యట్లేయని తల యూచుచు నవ్వలికిఁ బోయి యథాప్రకారము సంచరించును.

మృగయామద్య పౌశున్య వేశ్యా చౌర్య దురోచరపరదారాభిలాషంబులు నవయౌవనారంభమున సంభవించెనేని వాని మరలింప సృష్టించిన విరించికిని శక్యము కాదుగదా.

ఒకనాఁడు అగ్నివర్మ రాజసభనుండి యింటికివచ్చుచు దారిలో నొక జూదరివ్రేల నవరత్నస్థగితమగు దనయుంగర ముండుట గురుతుపట్టి వానిచేయి పట్టుకొని యోరీ? యిది నా యుంగరము. నీ కెట్లువచ్చినదని యడిగిన వాఁడు వెఱువక అయ్యా! దీని మీ కుమారుండు జూదములో నా కోడిపోయెను. నతనివ్యాపారములు మీ రెఱుంగరుకాఁబోలు నిదియొకఁ టననేల మీ యింటనున్న వస్తువులన్నియు జూదరుల యధీనమైనవి చూచుకొండని పలికిన సిగ్గుపడి మారుమాటపలుకక క్రోధావేశముతో నింటికిం జని సోమిదేవీ ! యేమిజేయుచున్నా విటురా? అని పిలుచువఱకు గడగడలాడుచు నీవలకు వచ్చి పనియేమి? అని యడిగిన నీవల నాకుఁ దలయంటుచు