పుట:కాశీమజిలీకథలు -09.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17]

యజ్ఞదత్తుని కథ

129

సీ. జహ్ను కన్యాస్నాన సంకల్పమును బోల
             దఖిల శాస్త్రాగ మాధ్యయనపుణ్య
    మమరస్రవంతీ లోకనము మనో
            వాక్కాయ కృతపాప భంజనంబు
    గంగామహా నిమ్నగా తీర వాసంబు
            గలుగ దీశ్వర కృపా కలనఁగాని
    భాగీరథీ కణాప్లావ మాత్ర లభించు
            బ్రహ్మ విజ్ఞాన సంభవ ఫలంబు
గీ. నిరతిశయ దుష్కృత క్రియానిరత నరత
    తులకు నీ కలియుగంబునఁ గలుష దమన
    మునకు సాధనమనిమిషధుని జలంబు
    దక్క వేఱొక్క దిక్కు వెదకినలేదు.

క. మది నిచ్చలేక ముట్టిన
   వదలక దహించునట్టి వహ్నిక్రియ నీ
   నది యిచ్చలేక మునిఁగిన
   విదళించున్ ఘోరకలుషవితతుల నెల్లన్.

క. సరిరావు వారణాశీ
   పురిమణము నొందవచ్చు పుణ్యముతో దు
   ష్కరదాస తపోధ్యయనా
   ధ్వర విజ్ఞానార్చనాది ధర్మము లెల్లన్.

అని మఱియు ననేక ప్రకారంబులఁ గాశీగంగాప్రభావం బభివర్ణించుచుండ నాలించి పులకితశరీరుండై మోహనుండు స్వామీ! యోడవచ్చు జాడ యింకనుం గనబడదు. ఈ లోపల గాశీప్రభావప్రఖ్యాపకంబగు నుపాఖ్యానం బేదేని వక్కాణింపుఁడని ప్రార్థించుటయు నా యోగిసత్తముండు సంతసించుచు నిట్లనియె. రాజపుత్రా! కాశీనగరప్రభావం బెన్ని దినములు వర్ణించినను వర్ణింపవచ్చు నందొక్క కథ మార్గదర్శకముగా నెఱింగింతు నాకర్ణింపుము.

యజ్ఞదత్తుని కథ

కాంపిల్యమను నగరంబున నగ్నివర్మయను బ్రాహ్మణుఁడు వేదవేదాంగపారంగతుండై సుశీలయను భార్యతో ననేక యాగములు సేసి దీక్షితుండని యన్వర్ధనామము వడసి రాజసన్మానితుండై యొప్పుచుండెను. ఆ పాఱునకుఁ బెద్దగాలమున నొక కుమారుం డుదయించుటయు వానికి యజ్ఞదత్తుడని పేరుపెట్టి గారాముగాఁ బెనుచుచు వానికుచితకాలమున నుపనయనముఁ జేసి గురువుల నొద్దఁ జదువనేసెను.