పుట:కాశీమజిలీకథలు -09.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

పాదు లెవ్వరివో యెఱింగింపుఁడని ప్రార్థించుటయు నా యోగీంద్రు డిట్లు చెప్పం దొడంగెను.

సీ. పసిఁడికుండలచేతఁ బ్రభఁగాంచి యలరారు
                  నదియె విశ్వేశుని యాలయంబు
    ఆప్రక్క గోపురోద్దీపితం బగునది
                  యన్నపూర్ణాదేవి యున్నఠావు
    పొడవైనకంబముల్కడఁ జూడఁబడునది
                  బిందుమాధవదేవు మందిరంబు
    రమణీయ మణిశేఖరములచే నొప్పారు
                 నదియె డుంఢీశుని సదనరత్న
గీ. మల్లదియె చూడుఁ డందు రాజిల్లునదియె
    దండపాణి వసించు సుందరగృహంబు
    కాళినగరి తలారి యక్కాలభైర
    వుని నికేతన మదియె కేతనము గలఁది.

సీ. మణికర్ణికాతీర్థ మణియల్ల దే చూఁడు
               డధికపుణ్యప్రదం బదియోకాశి
    సత్యంబునకు హరిశ్చంద్రుండు మును వల్ల
               కాడు గాచినయట్టి ఘట్టమదిగో
    పరమేష్టి యతినిష్ఠఁ బదియశ్వమేధమ్ము
               లాచరించిన ఘట్టమదె కనుండు
    కేదారఘట్ట మామీఁద నున్నదియె క్షే
              మేంద్ర ఘట్టంబులవియే పవిత్ర
గీ. మదియె హనుమంత ఘట్ట మయ్యదియె చక్ర
    పుష్కరిణిజ్ఞానవాసి యామూలనొప్పు
    నది తదద్భుత మహిమ నెల్లపుడు సురలు
    బొగడుదురు ముక్తిమంటపంబున వసించి

అమ్మణికర్ణికాతీర్థంబునం గావించిన స్నానదానజపహోమతర్పణాదు లక్షయమోక్షఫలంబు లొసంగు. సాంఖ్యయోగాదినియమంబులు తత్తీర్థస్నానంబునుం బోలనేరవు. కాశిం దర్శించినంతనె తులాపురుషప్రదానఫలంబు గలుగును. భగీరథానీతంబై మందాకినీనది మణికర్ణిక మీఁదుగా నుత్తరవాహినియై యిప్పురోపకంఠంబునం బ్రవహించుచున్నది. తన్మాహాత్మ్యం బగ్గింప సురాసురులకైన శక్యంబుగాదు. వినుండు.