పుట:కాశీమజిలీకథలు -09.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీప్రభావము కథ

127

మఱలఁ జంద్రికను వెంటబెఁట్టుకొని వచ్చితిమేని యాఱేడు మనలం బొలిమేర దాటనిచ్చునా? అందులకై కపటముగా దాని సాగనంపి లేచి వచ్చితిని. నీకు నా కన్నియం బెండ్లి యాడవలయునని యున్నచో వెనుకకుఁ బొమ్ము. అని పలికిన నతం డిట్లనియె.

స్వామీ? మాటవరుస కట్లంటిని. ఆ వాల్గంటి మన వెంట వచ్చిన నా ముందరికార్యమున కంతరాయము గలుగఁగలదు. మొదట నాకుఁ గపిల రాకయే యిష్టములేదు. చంద్రిక నెట్లంగీకరింతునని పలుకుచు నడుచుచుండెను. వారు వినోదముగాఁ జంద్రిగా వృత్తాంతమే చెప్పుకొనుచు మఱి నాలుగు పయనములు జరిపినంత నొకనాడు చంద్రిక చంద్రికారుచులు గేలిసేయు వారువము నెక్కి వాయువేగంబున వారిం గలిసికొనినది.

గుఱ్ఱము డెక్కలచప్పుడు విని వారెవ్వరో యని యాదెసఁ జూచుచుండఁ జెంతకు వచ్చి గుఱ్ఱము దిగి మహాత్మా! నేను మీ శిష్యురాలను చంద్రికను. మీసెలవు ప్రకారము యోగినీ వేషము వైచికొని వచ్చితినని పలుకుచు నా యోగికి నమస్కరించినది. మోహనునికి మ్రొక్కినది. కపిలం గౌఁగలించినది. అందరు విస్మయముతోఁ జూచుచుండ సిద్ధవ్రతుం డౌరా! చంద్రికా! నీ సాహసము, మీ వారికిఁ జెప్పివచ్చితివా? చెప్పకుండా వచ్చితివా చెప్పు మనవుఁడు నా జవరా లిట్లనియె.

స్వామీ! మీరు నన్ను మోసముఁ జేసి నాఁడే వచ్చితిరి గదా! అదియే మేలయినది. త్రికాలవేదులగు మీకుఁ దెలియని విషయము లుండునా? పాప మందుఁ గల సన్యాసుల నెల్ల జెఱసాలం బెట్టించి రెండు దినములు బాధించి మీరు కారని విడిచివేసిరి. మా తండ్రి నన్నుఁ బెద్దగా నిర్బంధించెను. నేను జచ్చుటకు నిశ్చయించికొనియుండఁ దెలిసికొని మా తల్లి రహస్యముగా గుఱ్ఱ మెక్కించి పంపివేసినది ఎట్లయినఁ దల్లికున్న ప్రేమ తండ్రి కుండదు. ఎందైనం బ్రతికియుండినం జాలని యామె యభిప్రాయము. మీ జాడలు తెలుసుకొనుచు గుఱ్ఱమెక్కి వాయువేగంబున వచ్చి మిమ్ముఁ గలసికొంటినని తన వృత్తాంతమంతయుఁ నెఱింగించెను.

అప్పు డాయోగి కపిలకువలెనే యామెకుఁగూడ నొక మంత్ర ముపదేశించి వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. వారట్లు పోయిపోయి కొన్ని దివసంబులకుఁ గంగానదీప్రాక్తటంబుఁ జేరిరి. అప్పుడే సూర్యోదయ మగుచుండెను. అది వర్షకాలమగుట గంగానది నింగి పొడవునఁ బొంగి ప్రవహించుచున్నది. వారు కాల్యకరణీయంబులు తీర్చుకొని రేవుదాట నోడకొఱ కెదురు చూచుచుండిరి. అక్కడికిఁ గాశీపురంబంతయుఁ దెల్లముగాఁ గనబడుచుండ నమస్కరింపుచు విశ్వేశు నభినుతించుచు భక్తివివశుండై మోహనుం నిట్లనియె.

మహాత్మా! మీరు కాశీపురంబున బెద్దకాలము వసించితిమని చెప్పితిరి. అందు మీకుఁ తెలియని విశేషము లుండవు. ఆ కనంబడు నాలయప్రాకారం మంట