పుట:కాశీమజిలీకథలు -09.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

డని యడిగిన వాండ్రు విమర్శించి దేవా! ఆ బాలయోగి మిగుల జక్కనివాఁడు. వారి వెంటనున్న వాల్గంటి మంచి యందగత్తె. వా రిందెవ్వరును గారని చెప్పిరి. రాజు వారి నెల్ల బంధవిముక్తులఁ గావించి పోపొండు. మా దేశము విడిచి పొండు. సన్యాసి పురుగు మా విషయమున నుండఁగూడదు. అని యాజ్ఞాపించి వారినెల్ల విడిపించి యంతఃపురమునకు వచ్చి భార్య కత్తెఱం గెఱింగించెను.

ఆమె నాథా! చంద్రిక బుద్ధి యెంత చెప్పినను దిరుగకున్నది. తనమూలమున నా సన్యాసులఁ బట్టించితిరని విని యురిఁ బోసికొనుటకు బ్రయత్నించుచున్నది. వారి విడిపింతునని బ్రతిమాలికొని వచ్చితిని. నగ లన్నియు దీసి పారవేసినది. జల్తారుచీర లన్నియుఁ బంచి పెట్టుచుండ వారించినఁ జించిపారవేసినది. కాషాయాంబరధారిణియై యోగినీవేషము ధరించినది. నిద్రలో సన్యాసులఁ బలవరింపుచున్నది. వాండ్రు దీని మంత్రబద్ధం జేసిపోయిరి కాబోలు? ఇందులకుఁ బ్రతితంత్రవేత్త లెవ్వరయిన నుండిరేమో రప్పింపుఁడు వాండ్రు నిన్ను మోసముఁ జేసి తీసికొని పోవుచున్నారని యెంతఁ జెప్పిన నొప్పుకొనదు. వారు మహానుభావు లనియు నేయంత్రము వేయలేఁదనియు నాతని రూపమే తనకు మోహనయంత్ర మైనదనియు నాతండే భర్తగ బ్రహ్మ లిఖించెననియు వాదించుచున్నది. అయ్యయ్యో? ఇప్పుడేమి చేయుదము? అది మనమాట వినదు. అన్నింటికిం దెగించి యున్నది. మనము నిర్బంధించిన బలవంతమునఁ జావఁగలదు. పోనిండు. ఆ బాలయోగి నిందు రప్పింపుఁడు. ఇందే యుండఁగలఁడని పలికినంత నతండు ప్రళయకాలమేఘమువలె బొబ్బ పెట్టి ఎట్టిమాట పలికితివి? నీ స్త్రీ చాపల్యమూరక పోయినదికాదు. అది చచ్చినం జచ్చుఁగాక. గట్టిగా రట్టుజేసిన దానిం గూడఁ గట్టి పారవేయించెదఁ గులము చెడఁబుట్టినది. ఈ విషయమయి దయఁదలచనని చెప్పుమని పలుకుచు నతండు తన మందిరంబునకుంబోయెను. రాజపత్నియు దుఃఖించుచుఁ గూఁతునొద్దకుఁ బోయినది.

191 వ మజిలీ.

కాశీప్రభావము

దైవజ్ఞుండగు సిద్ధవ్రతుండు నాఁటి వేకువజామున మఠమునుండి బయలుదేరి శిష్యులతోఁగూడ నుత్తరాభిముఖుండై యరుగునప్పుడు మోహనుండు మహాత్మా! నీ వసత్య మాడని వాఁడవుగదా. ఆ రాజపుత్రికతో నెల్లుండివఱకు నిందుండెదనని చెప్పి యప్పుడే బయలుదేరితి రేల? కపిల రాక కనుమోదించి యామె నట్లు వంచించితి రేమి? అని యడిగిన నయ్యోగి యిట్లనియె.

మోహనా! కపిలమూలమున మన కపఖ్యాతి చాల గలుగుచున్నది. బలశాలివి నీ వడ్డుపడబఁట్టి మేము బ్రతికితిమిగాని లేనిచో నాఁడు రెడ్డిచేతనున్న దుడ్డుకఱ్ఱచేఁ జావక పోపుదుమా? ఆ యాపద యెట్లో దాటినది. అగ్గి నొడి గట్టినట్లు