పుట:కాశీమజిలీకథలు -09.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రిక కథ

125

కటము లదరఁ బండ్లుగీటుచు నట నిలువక కొల్వుకూటంబునకుంబోయి యా బైరాగుల నెల్ల రప్పించి పరీక్షించి చూచెను.

సీ. కటిసూత్రములఁ గావి కౌపీనము బిగించి
             తోలు గప్పిన యవధూత యొకఁడు
    పొడుగుగడ్డము గిట్టపొట్ట వ్రేలాడ
             నవ్వించు బడుగు సన్యాసి యొకఁడు
    డొక్కలంటుకొని పో బక్కజిక్కి శవంబు
             పగిదిఁ గాన్పించు తపస్వియొకఁడు
    మేనెల్ల బసుమంబు మెత్తి నెత్తిని జటా
             జూటంబుఁ జుట్టిన జోగి యొకఁడు
గీ. రోగియై మూల్గుచున్న బైరాగి యొకఁడు
    భిక్షకై చిప్పఁ గై దాల్చుదాల్చు భిక్షుఁడొకఁడు
    కాని పరికింప మచ్చుకైనఁగాని
    వారిలో నొక్క చక్కనివాఁడు లేఁడు.

వారినెల్లఁ గలయం గనుంగొని యా నృపాలుం డలుక దీపింప మేకవన్నెపులులు, తృణచ్ఛన్నకూపములు, తేనెఁ బూసిన కత్తులవలెఁ దపస్వివేషము వైచికొని లోకుల వంచించుచున్న మీకు వేయఁదగిన శిక్ష యేదియో తోచకున్నది. పాములకుఁ బాలు పోసినట్లు కుపకారము జేసినందులకు నా పనియె పట్టితిరి. కృతఘ్నులారా? మీ దేహము తునకతునకలుగాఁ గోయించి కాక గృధ్రముల పాలుసేసిన దోసము లేదు. కానిండు. కానిండు జవ్వనములోనున్న యన్ను మిన్న యొకతె మీలో నున్నదఁట? అది కాన్పింపదేమి? దాని నెందు దాచితిరి? ఆలాటి బోఁటుల నెందరఁ దెచ్చితిరి? అక్కటా? తెలియక నిట్టి తుచ్చుల మఠంబునం గుడవ బెట్టుచుంటినే? ఆబాలయోగి యెందున్నవాఁడు? ఈ బడుగు లిట్లుండిరేమి? అని యడిగిన నందొక వక్త యగు సన్యాసి యీవలకు వచ్చి మ్రొక్కుచు నిట్లనియె.

మహారాజ! మున్నొక్కపామువలనఁ దన దండ్రి మృతి నొందెనని జనమేజయుఁడు సర్పయాగముఁ జేసినట్లు ఒక దుష్టుండు మిమ్ము మోసముజేయ నిరపరాధుల మమ్మెల్ల శిక్షింపఁ బూనితిరి పడుచుతో వచ్చిన సన్యాసు లారాత్రియే పారిపోయిరి, మే మేమియు నెఱుఁగనివారము. భోజనంబున కాసపడి మీమఠంబున వసించితిమి ఇంతవఱకు మమ్ము బిడ్డలవలెఁ బోషించితివి. నిజము విమర్శింపక యిప్పుడు మమ్ము శిక్షించితివేని యపఖ్యాతి వహింతువు. అని యుక్తియుక్తముగా నెఱింగించి యానృపతి మతిఁ గరింగించెను.

అప్పుడా నృపతి యించుకసే పాలోచించి నాఁడు చంద్రికతో మఠంబునకుఁ బోయినచారుల రప్పించి వీరిలో జంద్రికతో మాట్లాడిన యోగు లెవ్వరో చెప్పుఁ