పుట:కాశీమజిలీకథలు -09.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కొడుకులవలె తిని మత్తిల్లి యందుఁ గదలక స్త్రీలఁ జెఱబట్టుచున్నారు. ఇప్పుడు మీ కొంపమీఁదికే వచ్చినది. కాచుకొనుఁడని జరిగినకథ యంతయుం జెప్పినది.

ఆ వార్త విని భూభర్త క్రోధమూర్ఛితుండై ఏమీ? ఆ కృతఘ్నులు చంద్రికనే యంత్రబద్ధం జేసిరా? తామున్న యింటికే నిప్పంటిచుకొనిరా? కానిమ్ము. నేటితో వీరి సుఖములు పటాపంచలైనవి. వీరి దేహములు కాకగృధ్రముల పాలు చేయించెద జూడుమని పలుకుచు నప్పుడే యాస్థానమునకుఁ బోయి మఠంబునంగల సన్యాసులనెల్ల నా బాలవృద్ధముగాఁ బట్టికొని వెంటనే బందీగృహంబునం బడవేయుడు. తరువాత విచారించెదనని కింకరుల కాజ్ఞాపించుటయు వాండ్రు గాండ్రు మని యరచుచుం బోయి తెలతెలవారుచున్న సమయంబున నా మఠంబుననున్న బైరాగుల నవధూతల, బరివ్రాజకుల భిక్షుకుల నా బాలవృద్ధముగా వెదకు వెదకి తీసికొనిపోయి మొఱవెట్టుచుండఁ జెఱసాల బడవైచి యా మఠమును శూన్యముఁ గావించిరి.

మఱునాఁ డాఱేఁడు భార్యతోఁగూడ గూఁతునొద్దకు వచ్చి చంద్రికా! నీవు స్వతంత్రురాలవైతివఁటే. అంత చదివితి నింత మూఢురాలవైతివేమి? పెద్దలకుఁ దెలియకుండ మఠమునకుఁ బోవచ్చునా? పోయితివో చూచిరాక సన్యాసిని భర్తగా వరించి వాని వెంటఁ బోవుట కుద్యమించితివఁట. ఇది యేమి కర్మము. భూమండలాఖండలుల కుమారులకుఁ దప్పులు పట్టితివే? బిచ్చగాఁ డెట్లు నచ్చెను? అది స్త్రీయంత్రప్రభావమని యిప్పటికైనం దెలిసికొంటివా? ఆ ద్రోహులు నిన్ను యంత్రవివశం జేసినందులకు ఫలం బనుభవించుచున్నారు. రేపు వారినందఱం బలవంతమున జంపించెదఁ జూడుము. అని యత్యంతాగ్రహంబునం బలికిన విని చంద్రిక మెల్లన నిట్లనియె.

తండ్రీ! నీవు కోపించిన నేమియుం జెప్పఁజాలను. ఎవ్వరును నన్ను మంత్రబద్ధం జేయలేదు. సన్యాసులయం దిసుమంతయు దోసములేదు. ఎఱింగియో యెఱుఁగకయో స్వప్నఫలాశం జేసి స్వతంత్రించి నేనే యా మఠంబునకుం బోయితిని. అందొక బాలయోగి నా హృదయ మాకర్షించెను. చూచినతోడనే యతండు కారణజన్ముఁడని నిశ్చయించి యతఁడే నా భర్తయని త్రికరణంబుల వరించితిని. దైవికముగా నా కట్టిబుద్ధి పుట్టినది. ఇప్పుడేమి చేయుమందురు? శాస్త్రమెఱింగిన వేత్తలు మీరే చెప్పుడు. సతికిఁ బతితోడిదయ గతిగదా? సావిత్రి యేమి చేసినదో తెలియదా? నేను వారివెంటఁ బోవ దలఁచుట తప్పుగాదని నా యాశయము. మీరు వారిం జంపుదురా? సహగమనము జేసెదఁ గట్టింతురా నన్నుఁగూడ గట్టుఁడు. వేఱొక తెఱవు నాకాచరణీయము కాదని నిర్భయముగాఁ బలికినది.

రాజు - ఛీ ! ఛీ ! కులపాంసనురాలా! అవాచ్యము లాడెదవు! పుంశ్చలివై నీ తప్పు నీకుఁ దెలియకున్నది. సిగ్గువిడిచి నా యెదుట నేమేమో ప్రేలెదవు? అని