పుట:కాశీమజిలీకథలు -09.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రిక కథ

123

రాజపత్ని కూఁతునొద్దకు వచ్చి పుత్రీ! నీవు సన్యాసి మఠంబునకుఁ బోయితివఁట. ఎవ్వరితో జెప్పితివి? అని యడిగిన నేమియు మాటాడినది కాదు.

అప్పుడామె మోము జేవురింప మాటాడవేమి? నీ యుద్యమముఁ దెలిసికొంటి. సన్యాసులవెంటఁ బోవుటకు నిశ్చయించుకొంటివఁట. ఇవి యేమికర్మము. చక్రవర్తుల కుమారులకు వంకలుబెట్టి చివరకు సన్యాసిని వరించితివా? ఆహా యేమి నీ భాగ్యము? ఆహా ఏమి నీ సంకల్పము? సన్యాసులు స్త్రీ యంత్రవేత్త బద్ధలం జేసి స్త్రీల వశముఁ జేసికొందురు. . నీవు వారి యంత్రములోఁ బడితివికాఁబోలు చాలు. చాలు. నీ సంకల్పము మరలించుకొనుమని చెప్పిన విని కన్నులప్పళించుచు నా యొప్పులకుప్ప యిట్లనియె.

అమ్మా! నీతో నిజము చెప్పుచున్నాను. వినుము. నాకు నిన్నరాత్రి నొక కలవచ్చినది. అందు నాయభీష్టదేవత గనంబడి రేపు నీవు సన్యాసి మఠంబునకుఁ బొమ్ము ఉత్తమభర్తృలాభంబు గలుగఁగలదు అని చెప్పినది. అవ్వచనమునందలి విశ్వాసమున మీ కెవ్వరికిం జెప్పకుండఁ బోయితిని. చెప్పినట్లే త్రిలోకాభిరామసౌందర్యవిభ్రాజితుండు నాకు నేత్రపర్వము గావించెను. వాఁ డుత్తమకులజుండె కాని కారణాంతరమున దీక్షఁ బూని సన్యాసియై తిరుగుచున్నవాఁడు. పూజ్యమగు నా చిత్తము వానియందు లగ్నమైనది. నేనేమి చేయుదును? దైవముమ మీరువారుందురా? అతఁడే నా భర్తయని నిశ్చయించుకొని పెద్దవానితో నా కోరికఁ దెలిపితిని. దీక్షాంతమున స్వీకరింతునని చెప్పెను. ఆ దీక్ష కంతమెప్పుడో తెలియదు. మఱల వత్తుమని చెప్పిరి. కాని నేనిందుండి యేమి చేయుదును? వాని వరించి వేఱొకని బెండ్లి యాడిన వ్యభిచారినగుదుంగదా? శుశ్రూషఁ జేయుచు వారివెంటఁ బోవుటకు నిశ్చయించుకొన్న మాట వాస్తవము. నా యుద్యమమునకు మీ రెవ్వ రడ్డుచెప్పవలదు. నా ప్రారబ్ద మట్లున్నదని పలికిన విని రాజపత్ని ముక్కుపై వ్రేలిడుకొని యిట్లనియె.

సెబాసు చంద్రికా! నీ సంకల్పము చక్కగానున్నది. స్త్రీ యంత్రవేదులు స్త్రీలకు మన్మథులవలెఁ గనంబడుదురఁట. ఆ మాట సత్యమైనది. ఓహోహో! సన్యాసియట. రూపవంతుఁడట. దీక్షాంతమున స్వీకరించునఁట. ఎంత యుక్తముగా నున్నది. నిన్ను వాండ్రు యంత్రబద్ధం జేసి లాగికొనఁ బోవఁదలంచుచున్నారు. కానిమ్ము. వారి నిప్పుడే పట్టించి శిక్షింపఁజేసెద జూడుమని పలుకుచు నవ్వలికింబోయి భర్తకు వర్తమానముఁ బంపి రప్పించి యిట్లనియె.

నాథా! మీరు సన్యాసులకు మఠము గట్టించి సకలసదుపాయములు గల్పించినందులకు ఫల మిప్పటికిఁ గనంబడినది. పాములకుఁ బాలుపోసిన విషము గాకపోవునా? బూఁడిద బూసికొనినవాఁ డెల్ల విరక్తుఁడేనా నిజమైన విరక్తుడు మఠమునకు రానే రాఁడు. వచ్చినను నిలువఁడు. దొంగసన్యాసు లెల్లవచ్చి పెండ్లి