పుట:కాశీమజిలీకథలు -09.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

బునకు ఫలస్థులము మేము కాము ఇందు మఱెవ్వరేని యుండిరేమో యరసికొనుము. అనుటయు రాజపుత్రిక యిట్లనియె.

స్వామీ! నే నీమఠం బంతయుఁ జూచి వచ్చితిని. నాకు నచ్చినవారెందును గనంబడలేదు. మే దర్శనమే నన్నుఁ గృతార్థురాలిఁగా జేయునని తలచుకొంటిని. నాకు స్వప్నమందు గట్టినమ్మకము గలదు. దర్శనాదేవసాధవః అను నార్యోక్తి యేల తప్పును? మీ వలననే నా యభీష్టము దీరు నిది నిశ్చయము. మంచిదారిఁ జూపుఁడు. అనిన నా యోగి యిట్లనియె.

సుందరీ! నీ వట్లనిన మే మేమందుము? మమ్మేమి చేయుమందువు? నీ యభిలాష యేమి? యెఱింగింపు మనుటయు నా జవరాలు స్వామీ! సర్వజ్ఞులుమీ రెరుంగనిది కలదా? మీ రేమని యాశీర్వదించితిరో మరచితిరా? నాకా వరమే దయజేయుఁడని కోరినఁ నతం డోహో! సందిగ్ధముగాఁ బలుకకుము. నన్నేమి చేయమందువో నిరూపించి చెప్పుము. నీ యిచ్చవచ్చినట్లు చేయుదునని పలికిన ముఱియుచు నా తరుణి యిట్లనియె.

మహాత్మా! ఇఁక మీకడ దాచనేల? నాడెందము మీ శిష్యునందు లగ్నమైనది. అందులకే నీ నిందు వచ్చితిని. నింతకుముం దెన్నడైన నీ మఠముద్రొక్కి చూచితినేమో యడుగుఁడు. నా యభీష్టదేవతయే నాకీ యుపదేశము జేసినది. అందులకుఁ దార్కాణముగా నీ సుందరుని దర్శనమైనది. ఈతఁడే నా పతి. వీనినే వరించితి. అనుగ్రహించి వీని నిందు విడువుఁడు. పెండ్లి సేయింపుఁడని పలికినఁ పకాలున నవ్వి యవ్విరాగి యిట్లనియె.

విదుషీమణీ! నీవు మీగులఁ జదివినదాన విట్లు తొందరపడవచ్చునా? స్త్రీలు రూపముననే ప్రధానముగాఁ జూచి వరింతురు. ఇతర విషయముల నేమియు నూలోచింపరు. ఇతండు వ్రతస్థుండు. నిన్నెట్లు పెండ్లి యాడును? దీక్షాంతమైన పిమ్మట వెండియు నిందువచ్చి నీ యభీష్టముఁ దీర్పగలడు. అంతదనుక నాఁగిన నాఁగు మనవుఁ డాపడఁతి స్వామీ! త్రికరణంబులచే నితనిఁ బతిగా వరించితినిగదా! ఇఁక నాకు వేఱొకనితోఁ బనిలేదు. నన్నుగూడ మీ వెంటఁ దీసికొనిపొండు. శుశ్రూషఁ గావింపుచుండెద నెప్పటికైన నభీష్టము దీరినం దీరఁగలదు. లేకున్న నుత్తరజన్మమందైన వీనిఁ బతిగాఁ బడసెద నిదియే మదీయహృదయనిశ్చయము. దీని కడ్డు చెప్పవలదు. జెప్పితిరేని నాయాన యని యొట్టుపెట్టుటయు నతం డే మాటయుఁ బలుగక సరే నీ కిష్టమైనఁ గాషాయాంబరాదులు ధరించి మా వెంట రమ్ము. పొము . నీ నిమిత్తము రేపుగూడ నిం దాగెదము. మీ వారికిం జెప్పి యెల్లుండి యుదయంబున రమ్మని యాజ్ఞాపించుటయు నా యువతి సంతసముతో వానికిఁ మ్రొక్కుచు నతిరయంబున నాందోలికమెక్కి యింటికిం బోయినది.

ఆపైదలిదాదు లా సంవాదము వినియుంట వెంటనే యామె తల్లికిం జెప్పిరి.