పుట:కాశీమజిలీకథలు -09.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16]

చంద్రిక కథ

121

సార్దకము గాఁగ నేఁ డిందుఁ జూడతగిన వస్తువుం జూచితిని. స్వభావసుందరులకు వికృతులు గూడ శోభఁ దెచ్చునను మాట వాస్తవము వీని మేనికిఁ బూసిన బసుమంబు రుద్రాక్షమాలికలు జటాకలాపములు వింతయందముఁ దెచ్చుచున్నవి.

అక్కటా! వీఁడు సన్యాసియని యెఱింగియు నిర్దుష్టమ నా చిత్తము వీనియందు వ్యాపించుచున్న దేమి పాపము? నా స్వప్నమునకు ఫలంబిదియా యేమి? ఇప్పుడేమి చేయవలయునో నాకుఁ దెలియకున్నది. ఈ తగుల మెవ్వరు విన్నను నవ్వక మానరు. భూమండలంబున బేరు పొందిన రాజపుత్రుల నెల్ల నాక్షేపించిన నా హృదయము వీనిపై వాలుట నాకే వింతగా నున్నది. సీ! స్త్రీ హృదయముకన్నఁ జంచలమైనది మఱి యుకటి లేదు. అయ్యో? పల్లమునకు బోవు జలమువలె నామనము ఎంత మరలంచుకొనుచున్నను మఱలక వానిపై వ్యాపించుచున్నదిగదా! అని వితర్కించుకొనుచు వారితో సంభాషించి పోవలయునని నిశ్చయించి పల్లకి దింపుమని యాజ్ఞాపించి తటాలున లేచి శిబికాకవాటములఁ దెరచుకొని చెలులు త న్ననుసరించిరాఁ దిన్నగా సిద్ధవ్రతు నొద్దకుఁ బోయి పాదంబులకు సాష్టాంగనమస్కారముఁ గావించినది.

అనుకూలవల్లభ సమాగమోస్తు. అని యా యోగి దీవించెను. పిమ్మట మోహనునకు మ్రొక్కుటయు నతండుగూడ నట్లే యాశీర్వదించెను.

అప్పుడా చిన్నది వినయముతో మహాత్ములారా! మీ యాశీర్వచనములు వరంబులుగా స్వీకరించితిని. మీరు సత్యవచనులుగదా! మఱియు నేనభీష్టప్రాప్తి ప్రశ్నమునకై యిప్పు డీమఠంబున కరుదెంచితిని. మిమ్మిందుఁ గాంచి కృతార్థురాల నైతిని, మీ రెందుండి వచ్చితిరి? ఈ బాలయోగి మీ కంతేవాసి కావచ్చు. ఇంత లేబ్రాయంబున వైరాగ్యంబు వహింప నేమి వచ్చెను? ఈ మచ్చకంటి వీరి కేమి కావలయు ? మీ యుదంత మెఱింగించి నాకు శ్రోత్రానంద మాపాందింపుఁడు.

నేనీ దేశప్రభుండగు భీమవర్మ పుత్రికను. నా పేరు చంద్రికయండ్రు. మీకడ దాచనేల? రాత్రి స్వప్నములో నా యభీష్టదేవత గనంబడి రేపు మఠంబునకుఁ బొమ్ము. నీకు శుభంబగునని యానతిచ్చినది. ఆ మాటలయందుఁ గల విశ్వాసమున నిందు వచ్చితిని. మీకన్న నాకిందుఁ జూడఁదగినవారులేరని విని యా యోగి యిట్లనియె.

పుణ్యవతీ! నీవాఙ్నైపుణ్యము నీ పాండిత్యమును వెల్లడించుచున్నది. ఈ మఠమే మీ తండ్రిగారి యౌదార్యమును వేనోళ్ళుఁ జాటుచున్నది. సత్కులప్రసూతవగుట నిన్నభినందింపఁదగినది. బైరాగులకు నొకదేశము నొకనామము గలిగియుండదుగదా? ఈతం డొక్క గొప్పకులస్థుఁడు. ఒక కార్యదీక్షకై వ్రతస్థుఁడై మావెంట వచ్చుచున్నవాఁడు. ఈ తరుణికి నీతనికి నేమియు సంబంధములేదు. ఆమె ముత్తైదువుగా వచ్చుచున్నది. మేము కాశీపురంబున కరుగుచుంటిమి. నీ స్వప్నం