పుట:కాశీమజిలీకథలు -09.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    ప్రకటక్షేత్ర ఫలప్రసంగ మొకచో, బ్రహ్మత్వసంప్రాప్తి హే
    తుక విద్యాధివాద మొక్కయెడ, సాధుల్ గోష్టిఁ గావింపఁగన్.

శ్రోత్రానందముగా నాకర్ణించి వచ్చితినని తద్వృత్తాంత మెఱింగించిన సిద్ధ వ్రతుండు నవ్వుచు రాజపుత్రా! నీవు వోలె నీ పురుషుం డెవ్వఁడో బైరాగుల భోగులం జేయుచున్నాఁడు. ఇప్పని యతనికిఁ బుణ్యప్రదంబే కాని యీ యోగులకు మోహప్రదం బగుచున్నది. కానిమ్ము. ఆ గొడవ మనకేల నని మాట్లాడికొనుచుండ మఠోద్యోగస్థులు వచ్చి మహాత్ములారా! మీ కేమి కావలయును? దూరము నడిచి వచ్చితిరేమో? ఆ తల్పంబుల విశ్రమింపుఁడు. ఈ పరిచారకులు మీ కుపచారములు సేయుదురు గాక! వంటశాలకుఁ బోయి వలసిన పదార్థములు భుజింపుఁడు. అందు భుజింపరేని స్వయంపాకము జేసికొనుఁడు. సామాగ్రి యిప్పింతుమని యాదరంబునం బలుక సిద్ధవ్రతుండు మూ కేమియు నక్కరలేదు. మీ సత్కారముల కానందించితమని, ప్రత్యుత్తర మిచ్చెను.

వా రామఠవిశేషంబులఁ జూచుచు నాదివసంబు పయనంబు మానివేసిరి. సాయంకాలమునఁ గొందఱు రక్షకభటులు వచ్చి యందున్న బైరాగుల నెల్ల బరీక్షించుచు విరక్తులుగాక యందెవ్వరు నుండఁగూడదు. మా రాజపుత్రిక యోగుల సేవింప వచ్చుచున్నదని పలుకుచు నితరుల దూరముగాఁ దోలవేసిరి.

అంతలో నాందోళిక మెక్కి తలుపులు మూయించి రెండు దెసలఁ బరిచారికలు పల్లకిదండి పట్టుకొని వచ్చుచుండ రాజపుత్రిక యా మఠాంతరమునకు వచ్చినది. గవాక్ష వివరములనుండి యందున్న యోగుల నెల్లఁ బరిశీలించి చూచుచు నొకచోటఁ దనపల్లకి దెసఁ జూచుచున్న సిద్ధవ్రతుని మోహనునిం గపిలం గాంచినది. హృదయంగమంబైన మోహనుని సౌందర్యము జూచి విస్మయము జెందుచు నందాందోళికము నిలుపుఁడని పరిచారికలకు సంజ్ఞ చేసినది.

తలుపు లోరఁగాఁ దెరచి తదీయతేజోవిశేష మంతయుఁ బరికించి మేను పులకింపఁ జూచి చూచి తలయూచుచు -

మ. హరునిం గెల్వ మరుండిలం దపము సేయన్వచ్చెనా? లేక య
     య్యరవిందారి సమస్తమండలవిభుత్వాకాంక్షమై నిష్టకుం
     ధర కేతెంచెన! కాక యింద్రజుఁ డనంతత్వం బపేక్షించి దు
     ష్కరయోగవ్రత మూన నిట్లు మునివేషం బూనెనా? బాపురే?

సామాన్య యతికుమారుల కిట్టి సౌందర్యం బుండునా? వీనియాకారలక్షణంబులు పరీక్షింప భూమండలాఖండలుండుగా నుండవలసినది. ఇట్లు జోగియై తిరుగుటకుఁ గారణము తెలియకున్నది. ఆ చిన్నది వీని భార్య గాఁబోలు? ఆ యువతి రూపవతియే కాని వీని కాలికిని సరిపడినది కాదు. అందులనే యీతం డిట్లు బైరాగియై తిరుగుచున్నాడు. సన్యాసులకు భార్యలుందురా? ఎట్లైన నేమి నా కన్నులకలిమి