పుట:కాశీమజిలీకథలు -09.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

లెన్ని జెప్పినను గపిల తన్ను జూచిన చూపులవలన సక్తమయ్యెనని నిశ్చయించెను. అది మగనాలియని పాపభీతిఁ జెందుచుఁ దన యభిప్రాయము దెలిసికొన జూచిన నా యోగి కేమాటఁ జెప్పిన నేమనుకొనునో యని యేమియు సమాధానముఁ జెప్పకయూర కుండెను.

అప్పు డయ్యోగి తరుణీ! మేము విరాగులము, భోగముల నిరసించి తిరుగుచుంటిమి. నీవు జవరాలవు. నిక్కముగాఁ గామాసక్తవుగాక పరం బపేక్షించి మా వెంట వత్తునేని రమ్ము, లేకున్నఁ బొమ్ము. రెంటికిం జెడకుమని పలికిన నక్కలికి మహాత్మా! నా కైహికసుఖంబు లిదివఱకే గగనకుసుమములైనవి. వాని మునుపే వదలకొంటిని ఉత్తరజన్మమునందైన యభీష్టకామంబులఁ బడయుదు నేమోయని మీవెంట రాఁదలచితిని. మీరు విరక్తులని నే నెఱుంగనా? మహాత్ముల శుశ్రూషకన్నఁ దరింపఁజేయ వేఱొక సాధనము లేదు. నన్ను రక్షించి శిష్యురాలిగాఁ జేసికొనుఁడని ప్రార్థించినది. అతం డంగీకరించెను.

ఆ చిన్నది యమూల్యభూషాంబరాదు లదివఱకే విడిచివచ్చినది. ఆ పీతాంబరమే వల్కలముగాఁ జేసికొని యా యోగిపాదంబుఁ బట్టినది. ఆతం డేదియో మంత్ర ముపదేశించి జపము జేసికొనుచుండుమని నియమించెను.

రెడ్డిభయంబున వా రందుండక యప్పుడే బయలుదేరి యుత్తరాభిముఖముగా హుటాహుటి నడకలంబోయి మఱునాఁడు మధ్యాహ్నమునకు మఱియొకగ్రామముఁ జేరిరి. కపిల మోహనుని సౌందర్యము కన్నలారఁ గ్రోలి యానందించుచుండును. మోహనుండును దద్రామణీయమునకు మది చలించినను యోగి చెప్పిన మాటలం దలంచుకొని వికార మడంచుకొనుచుండును కపిల చూపులచేతనే సంతసించుచుండెను. ఆకారదర్శనముచేతనే తృప్తిఁ జెందుచుండెను.

కపిలమామయగు భద్రుఁడు తనకోడలు సన్యాసులం దగిలికొనిపోయినదని విని రౌద్రావేశముతో దండధరులఁ బెక్కండ్ర గాపులవెంటఁ బెట్టికొని నాడలం దీసి వేఱొక చెరువుగట్టున వారిం గలిసికొనియెను. కపిల దూరమునుండి వారిం గురుతుపట్టి బాబో! అదిగో. మామామ పదుగురతో వచ్చుచున్నాడు. మనలం గొట్టఁగలఁడు. ఎట్లు కాచెదరో యని మొఱవెట్టుచు సిద్ధవ్రతుని యొడిలో దూరినది.

అప్పుడు రాజపుత్రుఁడు ఓహో! నే నుండ వెఱవనేల? వీండ్రం బరిభవించి యనిపెదం జూడుఁడని పలుకుచు యోగదండముల కట్టలో దాచియుంచిన కరవాలముఁ దీసికొని కాచికొనియుండ నింతలో నాకాఁపులు మూఁగికొని జోగులారా ! కపటవేషములు వైచికొని మాపడుచుం దీసకొనిపోవుచున్నారా? ఎక్కడికిఁ బోయెదరు. నిలునిలుండని యడలించుచుండ మోహనుం డడ్డమై యవక్రవిక్రమంబునఁ బరిభ్రమించుచు వారిం దూరముగాఁ బారఁద్రోలి లఘుప్రహరణంబుల నాసాకర్ణచ్ఛేదనంబు గావించి పరిభవించెను.