పుట:కాశీమజిలీకథలు -09.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయదాసుని కథ

117

పడుచు నెట్టకేల కాయోగి కట్టెదుటకుఁ బోయి ఫలముల మ్రోల నునిచి యతనిపాదంబులం బడి నమస్కరింపుచు రక్షింపుమని ప్రార్థించినది. దయాళుండగు నాయోగి బాలా! నీ వెవ్వతెవు? ఏమి కోరి వచ్చితివి? యెఱింగింపుమని యడిగిన నమ్మగువ యిట్లనియె.

స్వామీ! నేను భద్రుఁడను రెడ్డికోడలను. నా పేరు కపిల యండ్రు. నా భర్తకు లోకజ్ఞాన మేమియును లేదు. వట్టి మూర్ఖుఁడు. భాగ్యమున కాసపడి నన్నా పురుషపశువునకుఁ గట్టిపెట్టిరి. నాభర్త నామొగ మెన్నఁడును జూచి యెఱుంగఁడు. బ్రహ్మచర్యవ్రతమే చేయుచుంటిని. అత్తమామలు కత్తులబోనులోఁ బెట్టి నన్ను బాధించుచున్నారు. నాకీసంసారమం దాసక్తి వోయినది. మహానుభావులు మీరిందు వచ్చితిరని మీపాదంబులం బట్ట వచ్చితిని. శిష్యురాలిఁగాఁ జేసికొని నన్ను మీవెంటఁ దీసికొనిపొండు. శుశ్రూష జేయుచుండెద ననుగ్రహింపుఁడని కోరిన నతం డిట్లనియె.

తరుణీ! యువతులకుఁ బతిశుశ్రూషకన్నఁ దరుణోపాయము వేఱొకటి లేదు. ఆతం డెట్టివాఁడైనను విడువరాదు. అధర్మకార్యములకు మే మంగీకరింపము. పొమ్మింటికిఁ బొమ్మని మందలించుటయు నా చపలాక్షి యక్షుల నశ్రువులు గ్రమ్మఁ గ్రమ్మర నమ్మహాత్మున కిట్లనియె.

స్వామీ! నాకు భర్తృశుశ్రూషఁ జేయు భాగ్యము పట్టినదికాదు నేను వెనుకటి జన్మమున గట్టిపాతకము గావించితిని. నా మగఁడు వెఱ్ఱివాఁడు. నా దాపున కెన్నఁడును రాఁడు. నేను బోయినఁ బారిపోవును. ఇంతకన్న మీకడ నే నేమి జెప్పుదును? నేను మి మ్మధర్మకార్యములఁ జేయమందునా. ఈ జన్మమున నింతియ నోచి పుట్టితిని. మీవెంట వచ్చి మీకు శుశ్రూషఁ జేయుచుండెద నుత్తరజన్మమునందైన నాకు సుఖము గలుగఁ గలదు నారాక కనుమతింపుఁడని ప్రార్థించుటయు నతం డిట్లనియె.

సుందరీ! త్రిభువనాతిశయసౌందర్యంబునఁ బొలుపొందు నీవు మావెంట వచ్చిన లోకులు మమ్ము విరక్తులని నమ్ముదురా? పొమ్ము పొమ్ము నీరాక సమ్మతము కాదనవుఁడు నా జవరాలు కన్నుల జలమ్ము గ్రమ్ము మహాత్మా! నేను దెగించియే యిల్లు కదలి వచ్చితిని. మా మామకు నే నిక్కడికి వచ్చితినని తెలియక మానదు. తెలిసిన నన్ను బ్రదుకనీయఁడు ఆ క్రూరుని చేతిలోఁ జావనేల? మీరు నారాక కనుమతింపనిచో నిప్పుడే యా చెరువులోఁబడి ప్రాణములు విడిచెద నిఁక నింటికిం బోవఁజాల. రక్షించిన రక్షింపుడు. అని మిక్కిలి దైన్యముగాఁ బ్రార్థించుటయు నాసిద్ధవ్రతుండు తదీయగంభీరోపన్యాసము విని యించుక యాలోచించుచు మోహనుని మొగము జూచెను.

మోహనునికిఁ గపిలం జూచినతోడనే స్మరవికార మించుక జనించినది. దృగంచలముల నడుమనడుమ నా చంచలాక్షి నీక్షించుచుండెను. ప్రగల్బములైనమాట